Friday, May 3, 2024

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తిరుపతి రైల్వేస్టేషన్.. డిజైన్ మార్పునకు కేంద్రం సానుకూలం: ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తిరుపతి రైల్వేస్టేషన్ నమూనాను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని వైసీపీ స్థానిక ఎంపీ గురుమూర్తి తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఆలయ నగరి తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా మార్చేందుకు పూర్తి స్థాయి వసతులతో పునరుద్దరణకు టెండర్‌ను ఖరారు చేసినందుకు ఎంపీ గురుమూర్తి కేంద్రమంత్రికి ముందుగా ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపని కోట్ల మంది సందర్శిస్తుంటారని, అయితే రైల్వే స్టేషన్ పునరుద్ధరణలో భాగంగా ఖరారు చేసిన డిజైన్లు భారతీయ సంస్కృతి , హిందూ సంస్కృతిని పోలి లేవని ఆయనకు వివరించారు. ప్రస్తుతం ఖరారు చేసిన భవన నమూనాలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారని ఎంపీ గురుమూర్తి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం గరుడాకృతిలో ఉంటుందని అశ్వినీ వైష్ణవ్‌కు వివరించారు.

ప్రతిపాదిత రైల్వేస్టేషన్ నిర్మాణాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మార్చి హిందూ సంస్కృతికి అనుగుణంగా, ప్రయాణికులకు ఆధ్యాత్మిక చింతన కలిగించేలా రూపొందించాలని కోరారు. ఈ పక్రియలో జాప్యం లేకుండా భవన ఆకృతులు ఏర్పాటు చేసేందుకు పునఃపరిశీలించాలని గురుమూర్తి అభ్యర్థించారు. కేంద్రమంత్రితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సామాన్య భక్తుల నుంచి సినీ ప్రముఖుల వరకు నమూనాపై తలెత్తిన అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించానన్నారు. ఆయన వెంటనే అధికారులను పిలిపించి డిజైన్లు మార్చాల్సిందిగా సూచించారని గురుమూర్తి వెల్లడించారు. త్వరలోనే మార్చిన డిజైన్లతో భూమిపూజ చేపడతామని హామీ ఇచ్చారన్నారు.

మరిన్ని రైల్వే సేవలకు వినతి
ప్రధానంగా తిరుపతి ప్రధాన బస్టాండ్ ఎదురుగా ఫార్చ్యూన్ కెన్సెస్ హోటల్ పూజిత రెసిడెన్సీ మధ్యలో మూసివేసిన లెవెల్ క్రాసింగ్ 106 వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి అవసరమని, రైల్వే లెవెల్ క్రాసింగ్ మూసిే వేయడంతో, జనం రైల్వై లైన్ దాటుతున్న సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారని గురుమూర్తి కేంద్రమంత్రికి వివరించారు. ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలని కోరారు. వెంకటగిరి రైల్వే స్టేషన్ దగ్గరలోని 565 జాతీయ రహదారిపై పెరియవరం దగ్గరలో 14వ లెవెల్ క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ నివారించేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం నిధులు మంజూరు కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అలాగే తిరుపతి నుంచి వారణాసికి డైరెక్ట్ రైలు సర్వీసు లేదని, ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైలు సర్వీసును ప్రారంభించవలసినదిగా ఆయన అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement