Friday, April 26, 2024

సత్యవేడులో తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి రోడ్ షో

స‌త్య‌వేడు – కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నట్టు తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి విమర్శించారు . తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో శనివారం మండల టిడిపి ఆధ్వర్యంలో సత్యవేడులో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో ఆమె మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన సందర్భంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించడం జరిగిందన్నారు . తదనంతరం పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లోనూ తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాను ఇవ్వడంతోపాటు , ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చినట్లు ఆమె గుర్తు చేశారు అయితే అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఆమె నిప్పులు చెరిగారు . ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించక పోగా , ఇరు రాష్ట్రాలే ఆ స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించుకోవాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ఎంతవరకు సమంజసమని కేంద్రాన్ని నిల‌దీశారు. వైఎస్ఆర్సిపీకి 23 మంది ఎంపీలు ఉన్న ప్రత్యేక హోదా పై పార్లమెంట్లో నిలదీయలేని పరిస్థితి వచ్చిందన్నారు . ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు వెనక్కి వెళ్ళి పోతున్నట్టు ఆమె ఆరోపించారు . అలాగే రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయడం , మన్నవరం ప్లాంటు అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది అన్నారు . తెలుగు వారి ఆత్మాభిమానాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం దెబ్బతీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మౌనం దాల్చడం సహేతుకం కాదన్నారు . రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ సన్నాయి నొక్కులు నొక్కు తున్న ప్రభుత్వం చివరకు రాష్ట్రానికి రాజధాని పేరు కూడా చెప్పుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు . దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 17వ తేదీన జరగనున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో తనను గెలిపించి సమస్యలపై గళాన్ని పార్లమెంట్లో వినిపించడానికి అవకాశం ఇవ్వాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి అభ్యర్థించారు .ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి నేతలు నిమ్మల రామానాయుడు , తిరుపతి పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు నరసింహ యాదవ్ ,మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష ,టీడీపీ ఇంచార్జ్ జెడి రాజశేఖర్ , మాజీ ఎమ్మెల్యే హేమలత , శ్రీధర్ , గాలిభాను ప్రకాష్ నాయుడు ,మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి , పరమశివం ,మునిస్వామియాదవ్ ,గిరి , భూపాల్ నాయుడు , కుబేఏంద్ర ,పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement