Saturday, April 10, 2021

దేశ ప్రజల సంక్షేమమే మోడీ ధ్యేయం – ఐవైఆర్ కృష్ణారావు

తిరుపతి – ఎన్ఆర్ సి, సి ఐ ఐ ల ఉద్దేశం పూర్తిగా స్వార్థ రాజకీయ నాయకులు తప్పుదోవ పట్టించారు. ప్రజలలో ఈ విధానాల పట్ల తప్పుడు అభిప్రాయాన్ని ప్రచారం చేశారని బిజెపి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. స్థానిక భీమాస్ రెసిడెన్సి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోడీ తాను చేస్తున్న ప్రతి సంస్కరణ ప్రతి ఆలోచన పూర్తిగా భారతదేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తున్నారని తెలిపారు. ఎంతో దూరదృష్టితో భావితరాల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో రోడ్లు రైల్వేలు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రానికి 70 వేల కోట్లు ఆదాయం ఉండగా 70 వేల కోట్లకు మించి ఖర్చులు ఉన్నప్పుడు ఆ రాష్ట్ర పురోగతి ఏ విధంగా సాగుతోందని ప్రశ్నించారు. వైయస్సార్సీపి స్వార్థ నాయకులకు ఇది తెలియక కాదన్నారు. అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థ అయిన టిటిడి శ్రీ వాణి ట్రస్ట్ పేరుతో భగవంతుని సేవలను వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. హిందూ ధర్మ పరిరక్షణ పూర్తిగా మంట కలిసింది అన్నారు ఈ ట్రస్టు ద్వారా వచ్చే ఆదాయంతో టిటిడి ఇప్పటివరకు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఎన్ని దేవాలయాలు నిర్మించారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్ టి, మత్స్యకారులను శిక్షణ ఇచ్చి వారి ప్రాంతాలలో ఆలయాలలో వారిని అర్చకులుగా నియమించే విధానం గతంలో టీటీడీ లో ఉండేది, దీని ద్వారా హిందూ ధార్మిక వ్యాప్తి విస్తృతంగా జరిగేది, మరి ఈ విధానానికి ఇటీవల కాలంలో ఈ శిక్షణ ఎందుకు ఆగింది అన్నారు. హిందూ మత ధార్మిక సంస్థల నీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయని తెలిపారు. అన్యమత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ హిందూ ధార్మిక సంస్థలను వైసీపీ ప్రభుత్వం అణచివేస్తూ ఉందన్నారు. హిందూ మత సంస్థలకు స్వేచ్ఛ లేకుండా చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలోని రెండు ప్రాంతీయ పార్టీలు బీజేపీపై అవాస్తవాలను ప్రజలలో ప్రచారం చేశారన్నారు. బిజెపి ప్రజలకు అన్యాయం చేసిందని తప్పుడు సమాచారం చేరవేశారు అని మండిపడ్డారు. మోడీ ప్రధాని అయిన తర్వాత మాత్రమే దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోంది అన్నారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో మోడీ ట్రెండ్ నడుస్తోంది ఒక్క ఆంధ్రరాష్ట్రంలో తప్ప అని అన్నారు. దేశం రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఒక్క బీజేపీ వల్లనే సాధ్యం అన్నారు. హిందు ధర్మ పరిరక్షణ కోసం వైసిపి ఏం చేస్తోంది. దళితవాడల్లో ఎన్ని ఆలయాలను ఇప్పటివరకూ నిర్మించారు..? అని ప్రశ్నించారు. బిజెపి వస్తేనే పరిస్థితులు మారుతాయి ధర్మ పరిరక్షణ జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపే సత్తా లేదన్నారు. బిజెపికి ఓటు వేసి అభ్యర్థి రత్నప్రభం తిరుపతి ఎంపీగా గెలిపించండి అప్పుడే మీ ఓటు విలువైనదిగా మారుతుందని తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యూఎన్సీ ఇన్చార్జి డాక్టర్ పార్థసారథి, రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఎమ్మార్ రాజా, కొత్తపల్లి అజయ్ కుమార్ , అనూష, బీమాస్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News