Sunday, December 8, 2024

అసెంబ్లీ టర్మ్ ముగిసిన తర్వాతే ఎన్నికలు… ఎమ్మెల్యే భూమన

తిరుపతి సిటీ, జులై 7 (ప్రభ న్యూస్ ): అసెంబ్లీ టర్మ్ ముగిసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. స్థానిక 30వ డివిజన్ నెహ్రూ నగర్ లో శుక్రవారం ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద రోజూ ఒకే రకమైన విమర్శ చేస్తే ప్రజలు నమ్మరని భావించి… చంద్రబాబు, కొత్త ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని రకాల మోసపూరిత ప్రకటనలు చేసినా, చేయించినా రానున్న ఎన్నికల్లో గెలుపు మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని ధీమా వ్యక్తం చేశారు.

2019 ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లుతో, ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి, మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని భూమన అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతున్న తమకు ప్రజాభిప్రాయంతో అది స్పష్టమైందన్నారు. కేవలం ప్రెస్ క్లబ్ ల్లో కూర్చుని పత్రికా సమావేశాల నిర్వహణకే పరిమితమైన వారికి వాస్తవాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు భయపడి, ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు పేపర్ పులులంతా ఏకమై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇప్పటికే చంద్రబాబుకు నాలుగు సంవత్సరాలుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిద్ర లేకుండా చేశారని, ఈ ఏడాదితో పాటు మరో ఐదేళ్లూ చంద్రబాబు నిద్రపోయే పరిస్థితి లేదని భూమన పేర్కొన్నారు. శాసనసభ పూర్తి కాలం సరిగ్గా ముగిసిన తర్వాతే ఎన్నికలు వస్తాయని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయనను సమర్థించే పవన్ కల్యాణ్ ను జగన్ మోహన్ రెడ్డి ఓటు అనే వజ్రాయుధంతో నరుకుతారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement