Monday, May 6, 2024

శ్రీవారి సేవలో రైల్వేశాఖమంత్రి..

తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌. ఆయనకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు మంత్రికి ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కరోనా కారణంగా గతేడాది స్వామివారిని దర్శించుకోలేకపోయానని చెప్పారు. యావత్ ప్రపంచానికి భారత్‌ తన శక్తిని చాటి చెప్పిందని, కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదురొన్నదని వెల్లడించారు. కరోనా సమయంలో 150 దేశాలకు ఔషధాలు సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం 75 దేశాలకు భారత్‌ వ్యాక్సిన్‌ను అందిస్తున్నదని చెప్పారు. కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదని.. వాక్సినేషన్ ప్రక్రియ ముగిసే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. మరింతమంది భక్తులు వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. తిరుపతికి మరిన్ని రైళ్లు నడిపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 80 శాతం రైళ్లను పున్నరుద్దరించామని.. డిమాండ్ ఉన్న ప్రతీ చోట రైళ్లను నడుపుతున్నామని తెలిపారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement