Wednesday, May 8, 2024

కిడ్నీ రాకెట్‌ చేధించిన బెజవాడ పోలీసులు.. నలుగురు అరెస్టు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విజయవాడ కిడ్నీ రాకెట్‌ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన కార్తీక్‌, నాగమణి, తమ్మిశెట్టి వెంకయ్య, కనక మహాలక్ష్మీ అనే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలే లక్ష్యంగా ఈ ముఠా కిడ్నీ రాకెట్‌ను నడిపిందని విజయవాడ వెస్ట్‌ ఏసీపీ హనుమంతరావు వెల్లడించారు. నిందితులకు రెండు కేసుల్లో ప్రమేయం ఉందని ఒక్కో కేసులో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు డీల్‌ కుదుర్చుకుని కిడ్నీ విక్రయాలు సాగిస్తున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే ఓ మహిళ తన బంధువుకు కిడ్నీ సమస్య వుందని తన కిడ్నీని అతనికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు, ఇందుకోసం ఫ్యామిలీ స్ట్రక్చర్‌, రెసిడెన్స్‌ సర్టిఫికేట్‌ కోసం ఆర్జీ పెట్టుకున్నట్లు, ఆర్జీని విచారించగా సదరు మహిళ డబ్బుల కోసం తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేసుకున్నట్లు విచారణ వెల్లడైందని ఏసీపీ వివరించారు. ఇదే సమయంలో విజయవాడ భవానీపురం తహసిల్దార్‌ దృష్టికి కూడా ఇదే తరహా దరఖాస్తు రావడంతో దానిపై కూడా విచారణ చేపట్టడంతో స్కాం బయటపడిందన్నారు.

కేసు వివరాలు ఇలా..

కిడ్నీ రాకెట్‌ కేసులో అరెస్టయిన నిందితుల వివరాలను ఏసీపీ హనుంమతరావు వెల్లడించారు. విజయవాడ, భవానీపురం, హెచ్‌.బి.కాలానికి చెందిన కాటి కార్తిక్‌, అతని భార్య కాటి నాగమణి, ఇదే ప్రాంతానికి చెందిన తమ్మిశెట్టి వెంకయ్య, వనమాల కనకమహాలక్ష్మిలను అరెస్టు చేశారు. నిందితుల్లో కాటి కార్తిక్‌ తాపి పని చేస్తుకుంటూ జీవించేవాడు. కరోనా అనంతరం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో తనకు తెలిసిన వారి ద్వారా కిడ్నీ మార్పిడిలో మధ్యవర్తిగా వ్యవహరించే బాబూరావు అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతని వద్ద పని చేస్తూ బాబురావు చెప్పిన వ్యక్తులను ఆసుపత్రికి తీసుకువెళ్ళడం, పరీక్షలు చేయించడం, తీసుకు రావడం వంటివి చేసేవాడు.

- Advertisement -

ఈ క్రమంలో ప్రముఖ ఆసుపత్రిలో పనిచేసే ఒక వ్యక్తి ద్వారా దీపక్‌ రెడ్డి (కిడ్నీ రిసీవర్‌)ని పరిచయం చేసుకుని కిడ్నీ ఇచ్చినందుకుగాను 29 లక్షలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్తిక్‌ తనకు తెలిసిన మహిళ ద్వారా వేరొక మహిళ కిడ్నీ ఇవ్వడానికి సుముఖం తెలపడటంతో ఆమెకు ఆరోగ్య పరీ క్షలు నిర్వహించి వద్దనుకున్నారు. తరువాత మరో మహిళకు డబ్బులు ఆశ చూపి తీసుకురాగా ఆమె కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుందని వైద్య పరిక్షలలో తేలింది.

అనంతరం గతంలో బాబురావు ద్వారా పరిచయమైన భవానిపురం బాలబాస్కర్‌ నగర్‌ ఏరియాకు చెందిన వనమాల కనక మహాలక్ష్మిని సంప్రదించగా తను గాడు చిన్నా అను మహిళకు మాయమాటలు చెప్పి కిడ్నీ ఇవ్వడానికి ఒప్పించి కార్తిక్‌, అతని భార్య నాగమణికి అప్పగించడం జరిగింది. ఈ విధంగా కనకమహాలక్ష్మి ఒక కిడ్నీ డొనేట్‌ చేయడానికి అప్పజెప్పినందుకు గాను సుమారు 80 వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు తీసుకుంటుంది. ఈ ముగ్గురికి పరీక్షలు చేయించినందుకు గాను దీపక్‌రెడ్డి వద్ద నుండి మూడున్నర లక్షలు కార్తిక్‌ తీసుకోవడం జరిగింది. గాడు చిన్నా వైద్య పరీక్షలలో సరిపోవడంతో దీపక్‌ రెడ్డి తనకు అన్న అవుతాడని తప్పుడు పత్రాలను సృష్టించి అర్జీ పెట్టుకోవడం జరిగింది.

రెండో కేసులో..

అదేవిధంగా సుమారు రెండు నెలల క్రితం మరొక మహిళ సత్యవతి (కిడ్నీ రిసీవర్‌)కు కిడ్నీ కావాలని అడగడంతో కార్తిక్‌ భార్య కాటి నాగమణి తన ఇంటిపక్కన నివసించే తమ్మిశెట్టి వెంకయ్యలతో విషయం చెప్పి అతని భార్యను కిడ్నీ మార్పిడికి ఒప్పించారు. అయితే డబ్బుల విషయంలో తేడా రావడంతో కార్తిక్‌ ఈ డీల్‌ను వదిలేశాడు. కొద్ది రోజులకు తమ్మిశెట్టి వెంకయ్య, సత్యవతి (కిడ్నీ రిసీవర్‌) నేరుగా మాట్లాడుకుని తన భార్య కిడ్నీ ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఇందుకోసం ఫ్యామిలీ స్ట్రక్చర్‌, రెసిడెన్స్‌ సర్టి ఫికేట్‌ కోసం తప్పుడు వివరాలతో ఆర్జీ పెట్టారు. దీన్ని గుర్రించిన భవానిపురం తహసిల్దార్‌ ఫిర్యాదు మేరకు స్కాం వెలుగులోకి వచ్చింది.

కాగా ప్రధాన నిందితుడు కార్తిక్‌ ఈ మొత్తం వ్యవహారంలో 29 లక్షలకు డీల్‌ సెట్‌ చేశాడు. కిడ్నీ డోనర్‌కు రూ.7.50 లక్షలు, ఇతరులకు రూ.21.50 లక్షలు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. నలుగురిని అరెస్టు చేయగా కేసులో మరింత లోతుగా విచారణ కొనసాగుతోంది, మరికొందరి ప్రమేయంపై ఆరా తీస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement