Friday, May 3, 2024

Delhi | వర్షాలు, వరదలతో తెలంగాణలో తీవ్ర నష్టం.. కేంద్రం జోక్యం చేసుకుని ఆదుకోవాలి : లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్రం తగిన రీతిలో ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ డా. కే. లక్ష్మణ్ కోరారు. గురువారం రాత్రి రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా మాట్లాడిన ఆయన.. ఊహించని రీతిలో కురిసిన అతి భారీ వర్షాలు రాష్ట్రంలో మెరుపు వరదలకు కారణమయ్యాయని తెలిపారు. వాటి కారణంగా ప్రజాజీవనం, జీవనోపాధి దెబ్బతిన్నాయని అన్నారు.

దాదాపు యావత్ తెలంగాణ రాష్ట్రం భారీ వర్షాల ప్రభావానికి గురైందని, గత 10 రోజులుగా వరంగల్, ములుగు, హైదరాబాద్, భద్రాచలం ప్రాంతాలు నీట ముంపులో ఉన్నాయని అన్నారు. ఒక్క ములుగు జిల్లాలోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారని, మొత్తం రాష్ట్రమ్మీద చోటుచేసుకున్న మరణాల విషయంలో ఇంకా లెక్క తేలాల్సి ఉందన్నారు. భూపాలపల్లి జిల్లాలో పోచంపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగిపోయిందని సకాలంలో ఆర్మీ సహా ఇతర సహాయ బృందాలు అక్కడికి చేరుకుని ప్రజల ప్రాణాలు కాపాడాయని చెప్పారు.

- Advertisement -

వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రైసీటీస్‌లో అనేక కాలనీలు నీట మునిగాయని, హైదరాబాద్ నగరంలో 1200 రోడ్లు, జాతీయ రహదారులు, కాలనీలు నీట ముంపునకు గురయ్యాయని వివరించారు. భద్రాచలం వద్ద గోదావరి నది ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల హెక్టార్లలో పంట నష్టపోయిందని, ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement