Monday, April 29, 2024

AP: కమ్యూనిజం భావజాలంలో మరో మావో కా.ఎస్ఏ రవూఫ్

శ్రీ సత్యసాయి బ్యూరో, ఫిబ్రవరి 8 (ప్రభ న్యూస్): గొప్ప విప్లవ యోధుడు, మావోయిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ ఎస్ఎ రవూఫ్ 11వ వర్ధంతి సభ ఇవాళ కదిరి పట్టణ సమీపంలో కుటాగుళ్లలోని, అనంతపురం రోడ్డులో గల ఎస్ఏ రవూఫ్ ఘాట్ వద్ద ఘనంగా నిర్వహించనున్నట్లు ఎస్ఏ రవూఫ్ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి పి.మహమ్మద్ అలీ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా అలీ ఖాన్ మాట్లాడుతూ.. నక్సల్బరీ, శ్రీకాకుళం ఉద్యమ శంఖారావాలు దేశమంతటా ప్రతిధ్వనించే కాలంలో కామ్రేడ్ చారు మజుందార్ పిలుపు అందుకుని, ఆంధ్రప్రదేశ్ నుంచి విప్లవ ఉద్యమాలకు నాయకత్వం వహించిన అగ్ర నాయకుల్లో కామ్రేడ్ ఎస్ ఏ రవూఫ్ అగ్రగన్యులు. జీవిత చరమాంకం వరకు చార్ మజుందార్ సిద్ధాంత వారసుడిగా, సుదీర్ఘకాలం పాటు జైల్లో నిర్బంధించినా వెలువని గొప్ప నాయకుడు ఆయన. అనారోగ్య కారణాలతో తన 88 ఏట అనగా 09-02- 2014 న తన తుది శ్వాస విడిచారు.

కామ్రేడ్ రవూఫ్ నిరాడంబర జీవితం, వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శప్రాయమైంది. తను నమ్మిన సిద్ధాంతం కోసం జీవిత పర్యంతం ప్రజల కోసం జీవించడం భావితరాలకు మార్గదర్శకం. గొంతుకలేని సామాన్య ప్రజల కోసం తన జీవితాన్ని దారపోసిన గొప్ప వ్యక్తి. ఇటువంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర భావితరాలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాగా కమ్యూనిజం భావజాలాన్ని విస్తరింపచేయడంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మావోయిస్టు, కారల్ మార్క్స్, లెనిన్ వంటి వారికి ఏమాత్రం తీసిపోని విధంగా కామ్రేడ్ రవూఫ్ గుర్తింపు పొందారన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో తన మేధా సంపత్తితో విప్లవ జ్వాలలను వెలిగించి, పీడిత, తాడిత ప్రజల కోసం పనిచేసిన గొప్ప మేధావి అన్నారు. ఆయన ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో వార, మాస పత్రికలు నడిపి సుమారు 10నుంచి 15 రాష్ట్రాల్లో తన విప్లవ సాహిత్యాన్ని చదివే విధంగా చేశారంటే ఆయన మేధా సంపత్తి ఏ పాటిదో ఊహించుకోవచ్చన్నారు. న్యాయవాద వృత్తి చేపట్టి, వృత్తిని వదిలేసి, పేద, పీడిత ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసి, అవివాహిత జీవితాన్ని గడిపి, నిస్వార్థంగా ప్రజాసేవకు అంకితమై ఎందరో మేధావులతో, ప్రఖ్యాత రాజకీయ నాయకులతో కొనియాడబడిన కామ్రేడ్ రవూఫ్ ప్రజల హృదయాల్లో మరో మావో గా నిలిచిపోయారంటే అతిశయోక్తి కాదేమోనని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement