Friday, April 26, 2024

సంక్రాంతికి 6,400 స్పెషల్‌ సర్వీసులు.. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడి

అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్స్‌ ప్రకటించింది. దసరా స్పెషల్‌ సర్వీసుల్లో మాదిరిగానే సంక్రాంతి స్పెషల్స్‌ సైతం సాధారణ చార్జీలకే నడపనున్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని 6,400 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు చెప్పారు. సంక్రాంతికి ముందు జనవరి 6 నుంచి 14 వరకు 3,120 సర్వీసులు, తర్వాత జనవరి 15 నుంచి 18 వరకు 3,220 ప్రత్యేక సర్వీసులు నడుపుతామని చెప్పా రు. అవసరమైతే అదనపు బస్సులు నడిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ హౌస్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎండీ తిరుమలరావు మాట్లాడుతూ, ప్రత్యేక సర్వీసుల్లో హైదరాబాద్‌, తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి 3,600, బెంగుళూరు నుంచి 430, చెన్నై నుంచి 150 ప్రత్యేక బస్సులను ఏపీలోని వివిధ ప్రాంతా లకు నడుపుతామన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడకు 800, విశాఖపట్టణానికి 450, రాజమండ్రికి 200, ఇతర ప్రాంతాలకు 770 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు చెప్పారు.

గత దసరా రద్దీలో సాధారణ చార్జీలకే ప్రత్యేక సర్వీసులు నడపడం వలన ఇతర రాష్ట్రాలతో సర్వీసులు(ఎస్‌టీయూ), ప్రైవేటు సర్వీసుల కంటే ఆర్టీసీ వైపే ప్రయాణికులు మొగ్గు చూపినట్లు ఆయన చెప్పారు. ఓఆర్‌(ఆక్యుపెన్షీ) శాతం కూడా పెరిగి ఆర్టీసీకి మంచి ఆదాయం సమకూరిందన్నారు. దూరప్రాంత ప్రయాణికులు రానుపోను టిక్కెట్లు ముందుగా రిజర్వేషన్‌ చేయించుకున్నచో ఏసీ, నాన్‌ ఏసీ సర్వీసుల్లో ప్రయాణ చార్జీలో 10శాతం(ఇరువైపులా) రాయితీ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.. సాధారణ చార్జీలే కావడంతో ఆన్‌లైన్‌ ద్వారా ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్‌ చేసు కోవాలని ద్వారకా తిరుమలరావు ప్రయాణికులకు సూచించారు.

- Advertisement -

నెలాఖరకు అన్ని బస్సుల్లో యూటీఎస్‌..

ఈ నెలాఖరు నాటికి పల్లె వెలుగు సహా అన్ని ఆర్టీసీ సర్వీసుల్లో యూటిఎస్‌(యూనిఫైడ్‌ టిక్కెట్‌ సిస్టమ్‌)ను ప్రవేశ పెట్టబోతున్నట్లు ద్వారకా తిరుమలరావు చెప్పారు. ఇందుకోసం కొత్త ఈ-పోస్‌ యంత్రాలు అందజేస్తామన్నారు. దేశంలోనే యూటీఎస్‌ విధానం అమలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీకి ఖ్యాతి దక్కిందన్నారు. కొత్త ఈ-పోస్‌ యంత్రంలో అమర్చే సిమ్‌ ద్వారా బస్సు జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఉంటుందన్నారు. ఇదే సమయంలో ప్రయాణికులు బస్సు బయలు దేరిన తర్వాత కూడా మధ్యలోని బస్టాండ్ల నుంచి టిక్కెట్‌ బుక్‌ చేసుకోవచ్చన్నారు. రానున్న రోజుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న యూపీఎస్‌ యాప్‌ ద్వారా బస్సులో ఖాళీలను కూడా ప్రయాణికులు తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు.

కారుణ్య నియామకాలు షురూ..

కారుణ్య నియామకాల ప్రక్రియ మొదలైందని ఎండీ తిరుమల రావు తెలిపారు. ఇప్పటి వరకు 191 మందికి కారుణ్య నియామకా లు చేసినట్లు చెపుతూ,విలీనానికి ముందు నియామకాలు 149 ఉండగా, విలీనం తర్వాతవి 42 ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఖాళీల భర్తీకి కారుణ్య నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీలో ఖాళీలను బట్టి తాము కూడా తొందరలోనే ఇందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పిన ఎండీ కొత్త బస్సుల కొనుగోలు వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో కొత్తగా తీసుకొచ్చిన స్టార్‌ లైనర్‌ నాన్‌ ఏసీ స్లీపర్‌ సర్వీసులను హైదరాబాద్‌, ఒంగోలు, కడప, విశాఖ పట్టణం, బెంగుళూరు తదితర రూట్లలో నడుపుతున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement