Thursday, May 2, 2024

తిరుచానూరు రైల్వే స్టేషన్ త్వరగా ప్రారంభించండి.. రైల్వే మంత్రికి తిరుపతి ఎంపీ డా. గురుమూర్తి వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తిరుపతి – రేణిగుండ జంక్షన్ స్టేషన్ల మధ్యనున్న తిరుచానూరు రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి ప్రారంభించాలని తిరుపతి ఎంపీ డా. గురుమూర్తి (వైఎస్సార్సీపీ) రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. సోమవారం ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. తిరుచానూరు రైల్వేస్టేష‌న్ ప్రారంభ‌మైతే తిరుప‌తి రైల్వేస్టేష‌న్‌పై ర‌ద్దీ భారం త‌గ్గుతుంద‌ని ఎంపీ గురుమూర్తి చెప్పారు. తిరుచానూరు రైల్వేస్టేష‌న్ అనేక విద్యాసంస్థ‌లు, ఆస్ప‌త్రులు, ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, సీఆర్ఎస్‌కు స‌మీపంలో ఉందని, తద్వారా విద్యార్థులు, రోగులు, రైల్వే సిబ్బందికి చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుందని ఎంపీ కేంద్ర మంత్రికి వివ‌రించారు. అలాగే రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే బ్రిడ్జి నంబర్ 171 నుంచి 175 వరకు 1200 మీటర్ల పొడవునా తగినంత నీటి పారుదల సౌకర్యం లేద‌న్నారు.

దీంతో కాలువలో మురుగు నీరు వెళ్లే మార్గం లేక వ‌ర్షాకాలంలో ట్రాక్ దెబ్బతినే ప్ర‌మాదం వుంద‌ని ఎంపీ వివ‌రించారు. ట్రాక్‌ను కాపాడేందుకు స్టార్మ్ డ్రెయిన్ అవసరమని మంత్రికి నివేదించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిల గురించి మాట్లాడుతూ వెంకటగిరి రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి 565 పై రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం తప్పనిసరని చెప్పారు. జాతీయ రహదారి నుండి సర్వేపల్లి మీదుగా ముత్తుకూరు వెళ్లే మార్గంలో వెంకటాచలం వద్ద ఉన్న గేటు వద్ద కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఆయనకి వివరించారు.

- Advertisement -

తిరుపతి వెస్ట్ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్‌కు దక్షిణం వైపు ఉన్న యాక్సెస్ రోడ్డు చాలా ఇరుకుగా ఉన్న విష‌యాన్ని మంత్రి దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. పశ్చిమ రైల్వే స్టేషన్‌కు ఉత్తరం వైపు రోడ్డు నిర్మాణం చేయాల‌ని, దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు తొలగుతాయ‌ని వివ‌రించారు. అలాగే వెండోడు రైల్వేస్టేష‌న్‌లో రైలు నెం.17405/17406 కృష్ణా ఎక్స్‌ప్రెస్, 17480/17489 తిరుపతి – పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ , తిరుమల ఎక్స్‌ప్రెస్‌ల‌ను నిల‌పాల‌ని కోరారు. క‌రోనాకు ముందు ఈ రైళ్ల‌న్నీ అక్క‌డ ఆగేవని మంత్రి దృష్టికి తిరుప‌తి ఎంపీ తీసుకెళ్లారు. వెండోడులో పైన పేర్కొన్న రైళ్లు ఆపకపోవడం వ‌ల్ల ప్ర‌యాణికులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారని మంత్రికి వివరించారు.

తిరుపతి- నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ అప్‌లైన్ రైలు వెంకటగిరి రైల్వే స్టేషన్‌లో ఆగుతోందని డౌన్‌లైన్‌ రైలు ఆగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వివ‌రించారు. ఆలాగే యశ్వంతాపూర్ – హౌరా ఎక్స్‌ప్రెస్ కూడా వెంకటగిరి వద్ద ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని ఎంపీ కోరారు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్‌లో కేరళ ఎక్స్‌ప్రెస్ 2 నిమిషాలు ఆగే విధంగా చూడాలని ఆయనకి విజ్ఞప్తి చేశారు.

పశ్చిమ రైల్వే స్టేషన్, తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఎస్వీ ఆర్ట్స్ , సైన్స్ కళాశాల, వెటర్నరీ కళాశాల, పద్మావతి మహిళా కళాశాల, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వంటి విద్యా సంస్థలకు సమీపంలో ఉన్నాయ‌ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేప‌థ్యంలో విద్యార్థులు, ఉద్యోగుల సౌకర్యార్థం ఉదయం, సాయంత్రం వేళల్లో రైళ్ల‌ నిలుపదలకు చర్యలు తీసుకోవాల‌ని విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

ఐఆర్సీటీసీ నడుపుతున్న రామాయణ యాత్ర 17-18 రోజుల పర్యటన కోసం నడుపుతున్న రైలు తిరుపతికి సమీపంలో ఉన్న రేణిగుంట రైల్వే స్టేషన్ మీదుగా వెళుతోందని, ఆ రైలును రేణిగుంట‌కు 10 కి.మీ దూరంలో ఉన్న తిరుప‌తికి వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. పీఎం గతిశక్తి కార్యక్రమం ద్వారా తిరుపతి నియోజకవర్గంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్టు డా. గురుమూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన వినతులపై మంత్రి సానుకూలంగా స్పందించిన‌ట్టు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement