Wednesday, May 15, 2024

డెయిరీ ఆస్తులు: కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేసిన రఘురామ

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజు దూకుడు పెంచారు. ఇప్పటికే సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ వేసిన రఘురామ.. తాజాగా డెయిరీ ఆస్తుల ఆంశంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీలో డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు బదలాయింపు చేసే అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు.  హైకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ డి. రమేశ్, జస్టిస్ కె. సురేశెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ రఘురామకృష్ణమరాజు తరపు‌న సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. అమూల్ వాణిజ్య కార్యకలాపాల కోసం ప్రభుత్వ సొమ్ము, వనరులను వినియోగించకుండా నిలువరించాలని పిటిషనర్ రఘురామ కోరారు.

ఈ వ్యాజ్యంపై విచారణను వేసవి సెలవుల తర్వాత చేపట్టాలని ప్రభుత్వ తరపు న్యాయవాది సుమన్ కోరారు. అప్పటి వరకు యథాతథ స్థితి పాటిస్తారా, స్టేటస్ కో విధించమంటారా అని ధర్మాసనం ప్రశ్నించింది. తమ కక్షిదారులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన న్యాయవాదులు అశోక్రామ్, జీఆర్ సుధాకర్ కోరారు. ఎంపీ వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే పాడి రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ విషయంలో మీ ఆసక్తి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. మీ విజ్ఞప్తితోనే అమూల్కు డెయిరీ ఆస్తులను ప్రభుత్వం అప్పగిస్తుందా? అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని స్పష్టం చేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement