Sunday, May 5, 2024

YSRCP – ఏపీ ఈస్టు వైసీసీలో ముస‌లం – సిట్టింగుల్లో ఆగ్రహం

ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రి వర్గాన్ని ఏపీ సీఎం జగన్ చేసిన అప్రమత్తం కబురు పార్టీ శ్రేణుల్లో గుండెల్లో గుబులు రేపింది. ఇప్పటికే గుంటూరు, ప్రశాశం జిల్లాల్లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టిన వైసీపీ అధిష్ఠానం తాజాగా ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపై దృష్టి సారించినట్టు సమాచారం.ఈ అంశం ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రెండో జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయి? . తమకు సీటు వస్తుందా? రాదా ? సర్వేల్లో ఏముంది? ఏ జిల్లాలో ఎలాంటి మార్పులు ఉంటాయి..? అనే సమాధానం లేని ప్రశ్నలతో రాష్ర్ట మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు ఆందోళనలో పడిపోయారు. మొదటి విడతలో ఉమ్మడి గుంటూరుపై ప్రత్యేక దృష్టి సారించిన అధిష్టానం తాజాగా రెండవ జాబితాలో సీటు లేని అభ్యర్థులకు ఇప్పటికే కబురు పంపిస్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రా జిల్లాలపై కసరత్తు జరుగుతోందని, ఏ క్షణంలోనైనా రెండో జాబితా వెలుగులోకి వస్తుంది. ఇదిలా ఉంటే..

ఈస్టులో … సిట్టింగుల చిచ్చు

తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యేల తల తిరిగింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు లేదని అధిష్టానం స్పష్టం చేసింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను అమరావతికి పిలిపించి పార్టీ పరిశీలకుడు మిథున్ రెడ్డి చేదు కబురు చల్లగా చెప్పారు. వీరి స్థానాల్లో ఎవరికి టిక్కెట్ ఇస్తుందీ చెప్పి మరీ సహకరించాలని హుకుం జారీ చేశారు. తమకు టిక్కెట్ లేదనడంతో ముగ్గురు ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయారు. తక్షణమే కాకినాడకు చేరుకుని తమ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఇంతకాలం జెండాను మోసిన తమకే పార్టీ టిక్కెట్టు లేదనటం సమంజసం కాదని రెచ్చిపోయారు. అధిష్ఠానం సీటును నిరాకరిం చడంతో జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు సమావేశం నిర్వహించారు. చంటిబాబుకు టిక్కెట్టు ఇవ్వక పోతే తమకూ పదవులు వద్దని రాజీనామా చేస్తామని కార్యకర్తలు చెప్పినట్టు సమాచారం,

ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకీ సీటు లేదని పరిశీలకుడు చెప్పటంతో శనివారం తమ అనుచరవర్గంతో ఈ ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించగా.. కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు సమాచారం. ఈ మూడు నియోజకవర్గాలకు చెందిన సుమారు 250 మంది వైసీపీ నాయకులు ఆదివారం రాజీనామా చేస్తామని ప్రకటించారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈస్టు గోదావరిలో ఈ అసంతృప్తి ఎమ్మెల్యేలను సీఎం జగన్ శనివారం సాయంత్రం సముదాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక జగ్గంపేట సీటు తనకే ఇస్తున్నారని మాజీ మంత్రి తోట నరసింహం ప్రకటించుకున్నారు. పిఠాపురం నుంచి వంగా గీత, ప్రత్తిపాడు నుంచి జానకీ దేవీని అధిష్టానం రంగంలోకి దించుతోందని ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement