Thursday, May 2, 2024

Yadadri – కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్టే – కేంద్ర మంత్రి అమిత్ షా

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రితెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వేలకోట్ల రూపాయల భూమిలను కబ్జా చేశాడని,భాజపా అధికారంలోకి రాగానే అవినీతిపై విచారణ జరిపి కేసీఆర్ ను జైలుకు పంపుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారం లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి లో నిర్వహించిన భాజపా సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, రాష్ట్రాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత మీ పైనే ఉన్నదన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కెసిఆర్ కు వేసినట్టేనని, 2014 ,2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. భూదాన్ పోచంపల్లిలో వినోభభావే భూదాన్ ఉద్యమం చేస్తే నేడు కేసీఆర్ భూ కబ్జా ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా మరచిపోయాడన్నారు. నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇస్తానని, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా విషయంలో కేసిఆర్ ఎన్నడు కూడా ప్రధాని మోడీని కలవలేదని, జాతీయ హోదా కల్పించలేదని కేసీఆర్ అబద్దాలను చెబుతున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపడుతామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ, మద్యం , ఓ ఆర్ ఆర్ కుంభకోణాల్లో ఉన్నదని, అధికారంలోకి రాగానే విచారణ జరిపించి జైల్లో పెడతామన్నారు.తెలంగాణ లో భాజపా అధికారంలోకి వస్తే మూసి ప్రక్షాళన చేస్తామని, భువనగిరి ఖిల్లను రూ. 25కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు.

డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఎస్సీ వర్గీకరణకు భాజపా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు విఆర్ఎస్ పలికే సమయం ఆసన్నమైందని చెప్పారు. భువనగిరి అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి, ఆలేరు అభ్యర్థి పడాల శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

అంతకుముందు అమిత్ షా కు హెలిప్యాడ్ వద్ద నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాం సుందర్ రావ్, కాసం వెంకటేశ్వర్లు, ఎసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పొతంశెట్టి రవీందర్, పాశకంటి భాస్కర్, సిఎన్ రెడ్డి, చందా మహేందర్ గుప్తా, ఊట్కూరి అశోక్ గౌడ్, రాజు, నర్సింహా చారి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement