Sunday, May 5, 2024

తెలంగాణ గర్వించే గొప్పనేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల : పరకాల పట్టణంలోని బస్ డిపో జంక్షన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆదివారం ఉదయం స్థానిక శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించారు. మొదటగా అంబేడ్కర్ సెంటర్ నుండి బస్ డిపో జంక్షన్ వరకు ఏర్పాటుచేసిన భారీ బైక్ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించి పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంత‌రం చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ హితామహుడు, స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టి నన్ను భాగస్వామిని చేసిన పద్మశాలి కులబాందవులకు కృతజ్ఞతలు తెలిపారు. నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడిలో ఒకరు మన కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. కొమురం భీం జిల్లా వాంకిడి గ్రామంలో జన్మించిన బాపూజీ స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసన సభ్యుడిగా నుంచి ఎన్నికై 1971 వరకు శాసన సభ్యునిగా కొనసాగారు. నిఖార్సయిన తెలంగాణ వాదంతో తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్తగా నిలిచి తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నారు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా వారు ఎంతో కృషి చేశారు. పి.వి.నరసింహా రావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన, ఇందిరాగాంధీ ఒప్పుకున్ననూ నాకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కావాలని కోరారు. సచివాలయం సమీపంలో హుస్సేన్ సాగర్ తీరాన (ప్రస్తుత నెక్లెస్ రోడ్డుపై) భూమి కొని జలదృశ్యం నిర్మించుకుంటే ఆనాటి ప్రభుత్వం కూల్చివేసింది. కానీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత అదే స్థలంలో ప్రభత్వం అదే స్థలంలో బాపూజీ విగ్రహాన్నిఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవన విశ్వవిద్యాలయంకి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహిస్తోందని తెలిపారు. మహాత్మా గాంధీనే పద్మశాలి వృత్తిని చేపట్టారు. సూరత్, బీమండి తదితర ప్రాంతాలకు బ్రతుకుదెరువు కోసం వలసలు వెల్లినవారిలో మన ప్రాంతం వాళ్ళే అధికం.. ఎందుకంటే ఆ ప్రాంతాలలో కేసీఆర్ ఆదేశం మేరకు స్టడీ టూర్ వెళ్ళడం జరిగింది. అది చూసే వారందరినీ తిరిగి రప్పించడం కోసమే సీఎం కేసీఆర్ మన నియోజకవర్గంలో కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేశారు. ఈ వస్త్ర పరిశ్రమలో పూర్తి స్థాయిలో కంపెనీలు స్థాపిస్తే దాదాపు ఒక లక్ష యాభైవేలకు పైగా ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికే రైతుల సహకారంతో 1350 ఎకరాల భూసేకరణ చేసి కంపెనీలతో ఒప్పందం కుదిరింది. సూరత్, బీమండీ తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారితో మాట్లాడి స్వంతగా కంపెనీలు ఏర్పాటు చేసుకునే మెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. మార్కండేయ గుడి నిర్మాణంలో తప్పకుండా నావంతు సహకారం ఉంటుంది.సహకార సంఘాల భవన నిర్మాణాలకు కూడా నిధులు కేటాయిస్తానని తెలిపారు.చేనేత కార్మికులకు కూడా ప్రభుత్వం అండగా నిలిచి వారి అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, మాజీ జెడ్పి చైర్మన్ సాంబారి సమ్మారావు, ఈగ మల్లేశం, మున్సిపల్ పాలక వర్గం, ఆయా మండలాల ఎంపిపిలు, జెడ్పిటిసిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, పోపా అధ్యక్షులు డా.పోతాయని రాజేశ్వర ప్రసాద్, బాలసాని దయాకర్, మార్త రాజు, దుంపేటి నాగరాజు, చిదురాల దేవేందర్, పద్మశాలి కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement