Sunday, April 28, 2024

WGL: తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ… సీపీఐ నేత శ్రీనివాసరావు

వరంగల్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. వరంగల్ నగరం శివనగర్ లోని సిపిఐ కార్యాలయం తమ్మెర భవన్ లో సిపిఐ వరంగల్ మండల సమితి సమావేశం దామెర క్రిష్ణ అద్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల విముక్తి పోరాటంలో బీజేపీ పాల్గొనలేదని, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధులను కూడా బీజేపీ గుర్తించలేదన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులు మాత్రమేనన్నారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఈనెల 11 నుండి ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జనగామ జిల్లాలో ఈనెల 11న‌ ఉదయం 11 గంటలకు నల్ల నరసింహులు విగ్రహం వద్ద జాతా ప్రారంభం కానుందని, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి దీనిని ప్రారంభించనున్నారని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డిగూడెం షేక్ బందగి సూపర్ వద్ద, మధ్యాహ్నం 2 గంటలకు ధర్మపురం, సాయంత్రం 3.30 గంటలకు పాలకుర్తి, సాయంత్రం 5 గంటలకు తొర్రూర్ మండలం అమ్మాపురంకు చేరుకుంటుందన్నారు. 12 సెప్టెంబర్ ఉదయం 11గంటలకు నెల్లికుదురు, 12: 30 గంటలకు మహబూబాబాద్, సాయంత్రం 3. 30 గంటలకు నెక్కొండ, సాయంత్రం 4.30 గంటలకు నర్సంపేటకు చేరుకుంటుందన్నారు.

13 సెప్టెంబర్ 12.30 గంటలకు వరంగల్, 14 సెప్టెంబర్ ఉదయం 11గంటలకు భూపాలపల్లి, సాయంత్రం 3.30 గంటలకు పరకాలకు చేరుకుంటుందని, సెప్టెంబర్ 15న 12. 30 గంటలకు హనుమకొండలో ముగుస్తుందన్నారు. ఈ సాయుధ పోరాట వార్షికోత్సవాలను జిల్లాలో జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ బాష్ మియా, నాయకులు గన్నారపు రమేష్, దండు లక్ష్మణ్, గుండె బద్రి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement