Friday, April 26, 2024

“చీట్”ఫండ్స్ అధినేతల అరెస్ట్ : విచారిస్తున్న పోలీసులు

వరంగల్ : “చీట్ ” ఫండ్స్ పేర ఖాతాదారులకు నిర్ణీత గడువులోగా చెల్లింపులు జరుపని సంస్థల నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చిట్ ఫండ్స్ నిబంధనలను అతిక్రమించి వ్యవహరించడమే కాక, చిట్స్ లిఫ్ట్ చేసిన వారికి డబ్బుల చెల్లింపులు జరపకుండా, మార్కెట్ ధర కంటే అధిక ధరకు లే అవుట్ స్థలాలు బలవంతంగా అంటగట్టే ప్రయత్నాలపై ఖాతాదారులు పోలీసులను ఆశ్రయించారు. పెద్ద మొత్తంలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఓరుగల్లు పోలీసులు మొత్తం వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొన్నారు. అందులో భాగంగా చిట్ ఫండ్ వ్యాపార రంగంలో దిగ్గజాలుగా పేరుగాంచిన బిగ్ షాట్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అక్షర చిట్ ఫండ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు, కనకదుర్గ చిట్స్ అధినేత రాగిడి. తిరుపతి రెడ్డి, ఆచల చిట్ ఫండ్ ఛైర్మెన్ పంచగిరి సత్యనారాయణ, ఎండి పంచగిరి పద్మ లను మొదటి విడతలో ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తోంది. వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ పోలీసులు, లోకల్ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. గతంలో అక్షర చిట్ ఫండ్ అధినేత పేరాల శ్రీనివాసరావు రాత్రి 10 గంటల సమయంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోకి వెళ్తూ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బంది నిలుపుతున్నా ఆగకుండ లోపలకు వెళ్ళి, పోలీస్ బాస్ ఎక్కడంటూ న్యూసెన్స్ చేసిన కేసు సుబేధారి పోలీస్ స్టేషన్ లో నమోదై ఉంది. అప్పటి నుండి చిట్ ఫండ్స్ మోసాలు, అక్రమ దందాలపై పోలీసులు ఓ కన్నేశారు. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో పోలీసులు కొంత వెనక్కి తగ్గినప్పటికీ, చిట్ ఫండ్స్ యజమానులు మరింతగా రెచ్చిపోయి ప్రవర్తిస్తుండటంతో వరంగల్ పోలీసులు చీట్ ఫండ్స్ మోసాలు, దగా పై ఫోకస్ పెట్టారు. నలుగురి బిగ్ షాట్స్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తుండటంతో చిట్ ఫండ్ కంపెనీ యజమానుల్లో గుబులు మొదలైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement