Friday, May 10, 2024

ఇష్టానుసార నిర్ణ‌యాల‌తో అప్ర‌తిష్ట పాల‌వుతున్న వ‌ర్సిటీలు…

హైదరాబాద్‌, (ప్ర‌భ‌న్యూస్): విశ్వవిద్యాలయాల అభివృద్ధి పేరుతో కొన్ని విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ యూనివర్సిటీల ప్రతిష్ట మసకబారుతోందనే చర్చ నడుస్తోంది. నిర్ణయాలను ఇష్టానుసారంగా తీసుకుం టున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి ఉంటాయి. ఆయా యూనివర్సిటీలో చేపట్టే అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలను వర్సిటీ ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌లో ఆమోదించుకున్నాకే అది పట్టాలెక్కుతోంది. వర్సిటీలకు నూతనంగా వీసీలను నియమించి దాదాపు 6 నెలలు కావొస్తుంది.

అయితే వర్సిటీల పరిపాలనను ఉరుకులు.. పరుగులు పెట్టించాలనే ఉద్ధేశ్యంతో కొంత మంది వీసీలు తొందర పాటు, ఇష్టానుసారం , ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వర్సిటీ వర్గాల నుంచి వెల్లువెత్తు తున్నాయి. ఫలితంగా ఇవి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం దృష్టికి వచ్చిన వర్సిటీ అంశాలను అప్పటి కప్పుడు ప్రభుత్వ పెద్దలు చక్కదిద్దుతున్నారు.

రాష్ట్రంలోని తెలంగాణ యూనివర్సిటీకి చెందిన వీసీ నిర్ణయం మేరకు చేపట్టిన ఔట్‌ సోర్సింగ్‌ నియామకాల్లో అవకతవకలు జరిగాయని దుమారం లేవడంతో సుమారు 120 మంది నియామకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సమస్యను చక్కదిద్దింది. అలాగే ఓయూ వర్సిటీకి చెందిన వీసీ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల బదిలీలపై తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కాంట్రాక్ట్‌ లెక్చరర్లు ఏకంగా మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించడంతో బదలీలను నిలిపేయాలని హెచ్‌ఆర్సీ ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. జేఎన్టీయూ వర్సిటీకి చెందిన వీసీ ప్రస్తుత రిజిస్ట్రార్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకోవడంతో సాయంత్రంలోగా తిరిగి అదే వ్యక్తిని రిజిస్ట్రార్‌గా కొనసాగించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.

తెలంగాణలోని కొన్ని యూనివర్సిటీలు ఎన్నో దశాబ్దాల చరిత్రను కలిగి ఉన్నాయి. అలాంటి వర్సిటీలకు వీసీలుగా బాధ్యతలు చేపట్టిన వారు వర్సిటీ ప్రతిష్టకు వన్నె తెచ్చే విధంగా నడుచుకోవాలని విద్యార్థి సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇతర దేశ, అంతర్జాతీయ వర్సిటీలతో పోటీ పడేలా వర్సిటీ విద్యావ్యస్థను బలోపేతం చేసే దిశగా అధికారులు ఆ బాధ్యతను తీసుకోవాలంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement