Friday, February 3, 2023

రెండేళ్లు స‌ర్వీస్ ఉన్న‌వారే బ‌దిలీల‌కు అర్హులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన కసరత్తును విద్యాశాఖ అధికారులు తుది మెరు గులు దిద్దుతున్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల మార్గదర్శకాలను మార్పులు చేర్పులతో దాదాపు ఖరారు చేశారు. పాఠశాలలో రెండేళ్ల సర్వీసు నిండిన ఉపాధ్యా యులకు మాత్రమే బదిలీలకు అవకాశం కల్పించనున్నారు. గతంలోనూ ఇదే నిబంధన ఉండేది. దీన్నే యథావిధిగా అమలు చేయాలని అధికారులు నిర్ణయిం చారు. అయితే బదిలీలకు ఉపాధ్యాయులందరూ దరఖాస్తు చేసుకునే విధంగా పాఠ శాలల్లో కనీసం రెండు సంవత్సరాల సర్వీసు ఉండాలనే నిబంధనను సడలించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ అంశం ఇంకా ప్రభుత్వ పరిశీ లనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అధికారులు రూపొందించిన మార్గదర్శకాల్లో మాత్రం ఈఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఒక పాఠశాలలో రెండు సంవత్సరాలు సర్వీస్‌ నిండిన వారు బదిలీలకు అర్హులుగా నిర్ణయించారు.

- Advertisement -
   

బదిలీలు వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా జరగనున్నాయి. ఎన్‌సీసీ ఆఫీసర్స్‌కు మాత్రం మాన్యువల్‌గా కౌన్సెలింగ్‌ నిర్వహించున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ప్రధానోపాధ్యాయులు ఒక పాఠశాలలో 5 సంవత్సరాల సర్వీస్‌ పూర్తి చేసినవారు, 8 సంవత్సరాలు పూర్తి చేసిన ఉపాధ్యాయులూ తప్పనిసరిగా బదిలీ కానున్నారు. అలాగే 3 సంవత్సరాలలోపు పదవీ విరమణ అయ్యేవారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపునిచ్చారు. ఇంతేకాకుండా బాలికల పాఠశాలల్లో 50 సంవత్సరాలలోపు వయసు ఉండే ఉపాధ్యాయులకు తప్పనిసరిగా స్థానచలనం ఉండనున్నట్లు మార్గదర్శకాల్లో నిబంధనలను రూపొందించారు. ఒకవేళ గర్ల్స్‌ పాఠశాలల్లో మహిళా టీచర్లు ఎవరూలేని సందర్భంలో 50 సంవత్సరాల వయసు నిండిన పురుషు ఉపాధ్యాయులకు అనుమతినివ్వనున్నారు. ఎస్‌ఎస్‌సీ ఫెర్ఫార్మెన్స్‌ పాయింట్లు, సర్వీస్‌ పాయింట్లను తొలగించారు. హెచ్‌ఆర్‌ఏ ప్రకారం వర్గీకరణ పాయింట్లకు సంబంధించి గతంలో ఉన్న నాల్గవ కేటగిరీని తొలగించారు. స్పౌజ్‌, అవివాహిత మహిళలకు 10 అదనపు పాయింట్లు కల్పించారు. అయితే వీటిని ఎనిమిదేళ్లలో ఒకసారి మాత్రమే వినియోగించుకోవాలని నిబంధన పెట్టారు.
అందరికీ స్పౌజ్‌ వర్తింపు…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు కూడా స్పౌజ్‌ బదిలీలకు అవకాశం కల్పించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే స్పౌజ్‌ వర్తింపు ఉండేది. కానీ 317 జీఓ కారణంగా ఈ సమస్య ఉత్పన్నం కావడంతో చాలా మంది స్పౌజ్‌ బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలోనే అందరికీ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఓడీ(ఆన్‌డ్యూటీ) ఉన్న సంఘాలు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 10 పాయింట్లు ఇవ్వనున్నారు. అలాగే ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో 70 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులు, వితంతువులు, విడాకులు పొంది ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు చేర్చారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల లేదా వారి జీవిత భాగస్వామి(స్పౌజ్‌) క్యాన్సర్‌, బోన్‌ టీబీ, బైపాస్‌ సర్జరీ, కిడ్నీ, లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, న్యూరో సర్జరీతలో పాటు మస్య్కూలర్‌డిస్ట్రోఫీ, డయాలసిస్‌ వ్యాధితో బాధపడుతున్న వారిని చేర్చారు. జువనైల్‌ డయాబెటిస్‌, మానసిక వైకల్యం, గుండెజబ్బు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో పొందుపర్చారు. ఈ కేటగిరీని వాడుకునే వారు ఈఏడాది జనవరి 1వ తేదీ తర్వాత ఉన్న తేదీలలో జిల్లా మెడికల్‌ బోర్డు నుండి సర్టిఫికెట్‌ జత చేయాల్సి ఉంటుంది. అయితే ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే స్పెషల్‌ కేటగిరీ పాయింట్స్‌ లేదా ప్రిఫరెన్షియల్‌ కేటగిరీని ఇద్దరిలో ఒక్కరు మాత్రమే వాడుకోవాలి. ఒకే జిల్లాలో పనిచేస్తున్న వారికి మాత్రమే స్పౌజ్‌ పాయింట్స్‌ వర్తిస్తాయి.
మల్టిజోన్‌, జిల్లా స్థాయిలో బదిలీలు, పదోన్నతులు…
ప్రధానోపాధ్యాయులకు మల్టిdజోన్‌ స్థాయిలో బదిలీలు, పదోన్నతులు జరిగితే ఇతర ఉపాధ్యాయులకు మాత్రం జిల్లా స్థాయిలో జరుగుతాయి. మల్టిdజోన్‌ స్థాయిలో డిఎస్‌ఈచే నామినేట్‌ చేయబడిన జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి సీనియర్‌ అధికారి ఛైర్మన్‌గా, ఆర్జేడీ సెక్రటరీగా, డీఈఓ సభ్యునిగా కౌన్సెలింగ్‌ కమిటీ ఉంటుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా, జాయింట్‌ కలెక్టర్‌ వైస్‌ ఛైర్మన్‌గా, జెడ్పీసీఈఓ సభ్యునిగా, డీఈఓ సెక్రటరీగా కమిటీ ఉంటుంది. అదేవిధంగా జిల్లాస్థాయిలోని జెడ్పీ, ఎంపీ ఉపాధ్యాయులకు జెడ్పీఛైర్‌పర్సన్‌ ఛైర్మన్‌గా, కలెక్టర్‌ వైస్‌ ఛైర్మన్‌గా, జాయింట్‌ కలెక్టర్‌ సీఈఓ సభ్యులుగా, డీఈఓ కార్యదర్శిగా కమిటీలో ఉంటారు. స్కూల్‌ అసిస్టెంట్లకు, ఎస్జీటీలకు డీఈఓ బదిలీ అధికారిగా ఉంటారు. గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకు ఆర్జేడీ బదిలీ అధికారిగా ఉంటారు. బదిలీ ఆర్డర్‌ పొందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ ప్రస్తుత విద్యాసంవత్సరం 2022-23 చివరి పనిదినం రోజు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల నుండి రిలీవ్‌ కావాలి. ఇదిలా ఉంటే ఏదైతే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదలైందో అది అధికారిక షెడ్యూల్‌ కాదని విద్యాశాఖలోని ఓ కీలక ఉన్నతాధికారి తెలిపారు. అందులో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement