Sunday, April 28, 2024

టీఎస్ ఆర్టీసీ మ‌ళ్లీ మ‌ళ్లీ.. ప్రత్యేక బస్సులకు 25శాతం ప్రత్యేక చార్జీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టోల్‌ చార్జీలు, సేఫ్టీ సెస్‌, డీజిల్‌ సెస్‌ల పేరుతో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులపై దొడ్డి దారిన భారీగానే వడ్డించింది. వీటికి తోడుగా బస్‌పాస్‌ల చార్జీలను కూడా పెంచింది. ఈ పెంపు స్వల్పమేనని, సెస్‌లన్నింటినీ ప్రజామోదం లభించిందంటున్న యాజమాన్యం మరో వడ్డింపునకు సన్నద్దమైంది. పండుగలు, తిరునాళ్ళు, ఇతరత్రా సందర్భాలలో ఆర్టీసీ నడిపించే ప్రత్యేక బస్సులకు ప్రత్యేక చార్జీలను మళ్ళీ వసూలు చేయాలని ప్రతిపాదించింది. అయితే ఈ చార్జీల ప్రభావం ఇప్పటికిప్పుడు ప్రయాణికులపై పడకపోయినప్పటికీ రద్దీ సమయాలు, పండగలు, తిరునాళ్ళు సమయాలలో పడక తప్పదు. ఆర్టీసీ యాజమాన్యం రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కొన్నేళ్ళుగా ప్రత్యేక బస్సులలో 50 శాతం అధిక చార్జీలను వసూలు చేసింది. ఏడాది క్రితం సంస్థ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రత్యేక చార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో దసరా, దీపావళి పర్వదినాలకు ఊరెళ్ళే ప్రయాణికులు కొంత ఊరట చెందారు. అప్పట్లోనే ఎండీ తీసుకున్న నిర్ణయంపై సంస్థ ఉద్యోగులు, అధికారులు ఒకింత అసహనాన్ని వెలిబుచ్చారు. ప్రత్యేక బస్సులకు ప్రత్యేక చార్జీలు ఉండాల్సిందేనని, లేకపోతే ఒక వైపు మాత్రమే రద్దీతో వెళ్ళే బస్సు తిరుగు ప్రయాణంలో ఖాళీగా రావడం ద్వారా సంస్థ నష్టపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రత్యేక చార్జీలను రద్దు చేసినప్పటికీ దసరా, దీపావళి సీజన్‌లో ప్రయాణికుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే లభించింది. దీన్ని పెట్టుకున్న యాజమాన్యం ప్రత్యేక బస్సులకు ప్రత్యేక చార్జీలను కొనసాగించాలని ఎండీకి వీలున్నప్పుడల్లా చెబుతూనే వస్తున్నారు. ప్రత్యేక చార్జీలను రద్దు చేసినప్పటికీ సంస్థకు అదనపు ఆదాయం సమకూరకపోగా నష్టం వచ్చిందని చెబుతూ వచ్చారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఎండీ ఈ దఫా ప్రత్యేక బస్సులకు ప్రత్యేక చార్జీని వసూలు చేయాలని, ఈ చార్జీని 50 శాతం కాకుండా కేవలం 25 శాతం మాత్రమేనని నిర్ణయించి అన్ని డిపోలు, రెవెన్యూ విభాగాలకు అంతర్గత సమాచారాన్ని చేరవేశారు. సంస్థను ఆర్థికంగా పరిపుష్టం చేయాలంటే కొన్ని నిర్ణయాలను పున: సమీక్షించుకోవాల్సి వస్తుందని, అందులో భాగంగానే గతంలో రద్దు చేసిన ప్రత్యేక చార్జీలను తిరిగి కొనసాగించాలని నిర్ణయించామని అధికారులు అంటున్నారు.

ఈ దఫా చార్జీ కేవలం 25 శాతం మాత్రమే కాబట్టి దీన్ని కూడా ప్రయాణికులు అంగీకరిస్తారని భావిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక బస్సులను సంస్థ ఎప్పుడూ నడపదని, ప్రత్యేక సందర్భాలలోనే నడుపుతున్నందున ఈ భారం కొంత మంది ప్రయాణికులపైనే పడుతుందని చెబుతున్నారు. ఇటీవల ముగిసిన సమ్మక్క – సారలమ్మ జాతర ప్రత్యేక బస్సులకు ప్రత్యేక చార్జీలను వసూలు చేశామని అధికారులు గుర్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement