Tuesday, May 7, 2024

Big Story: డబుల్‌ ఇండ్లకు డబ్బులే ట్రబుల్‌.. ఫండ్స్‌ లేక ముందుకు సాగని పనులు

(ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి) : డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి డబ్బులే ప్రధాన సమస్యగా మారింది. సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పాత బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కొత్త పనులు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే జిల్లాలో రూ. 12కోట్లమేర కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. బిల్లుల కోసం సదరు కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలపై వత్తిడీలు కూడా తెస్తున్నా పెద్దగా ప్రయోజనం కలగడం లేదు. సకాలంలో బిల్లులు చెల్లిస్తేనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం వేగంగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కోసం ఎకంగా 95వేలమంది నిరుపేదలు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇళ్లు వస్తాయనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. గిట్టుబాటు కావడం లేదని డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఎమ్మెల్యేల వత్తిడీతో కొందరు ముందుకు వచ్చినా సకాలంలో బిల్లులు రాకపోవడం వారిని ఇబ్బందులపాలు చేస్తోంది. పనులు చేయడమే గొప్ప అనుకుంటే బిల్లుల కోసం నెలలతరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

సామాన్య మధ్యతరగతి వర్గాలకు డబుల్‌బెడ్‌రూం చిరకాల స్వప్నం. ఇళ్ల కోసం 4 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ ఎదురుచూడటం తప్పిస్తే ప్రయోజనం పెద్దగా కనిపించడం లేదు. నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని 2015-16, 2016-17 సంవత్సరానికి నియోజకవర్గాల వారీగా డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల, రాజేంద్రనగర్‌, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలో 6,637ఇళ్లు మంజూరు చేశారు.

- Advertisement -

ఇందులో చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలో 1,705 ఇళ్లు పంచా యతీరాజ్‌ శాఖ నిర్మాణాలు చేపట్టగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్ర నగర్‌, షాద్‌నగర్‌ నియోజకవర్గాల పరిధిలో 4,932 ఇళ్లు రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇందులో 3,977 ఇళ్లు గ్రామీణ ప్రాంతాల పరిధిలో 2,800ఇళ్లు మునిసిపాలిటీల పరిధిలో చేపట్టారు. 2,956 ఇళ్ల నిర్మాణానికి వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వగా 2,713ఇళ్లు పురోగతిలో ఉన్నాయి. 2045 ఇళ్లు చివరి దశకు చేరుకున్నాయి. మంజూరైన ఇళ్లలో కేవలం 30శాతం మేర కూడా ప్రగతి కనిపించడం లేదు. డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల కోసం వేలాదిమంది ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

మౌలిక సదుపాయాల కొరత..
జిల్లాలో ఐదేళ్లుగా డబుల్‌బెడ్‌రూం ఇళ్లకోసం ఎదురుచూస్తున్నారు. అష్టకష్టాలుపడి 2వేల ఇళ్లను పూర్తి చేశారు. వీరికి మౌళిక సదుపాయాలు కల్పిస్తే గృహ ప్రవేశాలు చేసుకోవచ్చు. ఇందుకు గాను రూ. 26కోట్లు అవసరమని గృహ నిర్మాణశాఖ అంచనా వేసింది. నిధుల కోసం సంబంధిత శాఖ మంత్రికి ప్రతిపాదనలు కూడా పంపించారు. ఇది జరిగి రెండుమాసాలు దాటిపోయింది ఐనా నేటికీ రూ. 26కోట్లు మంజూరు కాకపోవడంతో మౌళిక సదుపాయాలు కల్పించే పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. భవన నిర్మాణాలు పూర్తి అయ్యాయి. డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్తు సౌకర్యంతోపాటు నీటి వసతులు కల్పించాల్సి ఉంటుంది.

ఈ నిధుల కోసం రెండుమాసాలుగా ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం కొంతమేరకైనా గృహ ప్రవేశాలు పూర్తి చేయాలని భావిస్తున్నా ఇప్పట్లో తీరేట్లు కనిపించడం లేదు. మౌళిక సదుపాయాల కోసం రూ. 26కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినా పనులు పూర్తి చేయాలంటే కనీసం మూడు మాసాల సమయం పడుతుంది. అంటే ఈ ఏడాదిలో జిల్లాలో డబుల్‌బెడ్‌ రూం గృహ ప్రవేశాలు జరిగే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. ఇప్పట్లో నిధులు మంజూరు చేసినా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో 2వేలకు పైగా గృహ ప్రవేశాలు జరుపుకునే వీలుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement