Sunday, May 5, 2024

TS – దామెర చెరువుపై మ‌ళ్లీ లొల్లి! మళ్లీ కూల్చివేతలు ప్రారంభం

చెరువు ఆక్రమణల తొలగింపున‌కు కలెక్టర్ ఆదేశాలు
పోలీసు బందోబస్తు నడుమ ఎంఎల్ఆర్ఐటీకి చేరుకున్న అధికారులు
అధికారులకు అడుగడుగునా అడ్డంకులు..
ఆట‌కం క‌ల‌గించిన క‌ళాశాల యాజ‌మాన్యం
అధికారుల మీదికి విద్యార్థులను ఎగదోసిన మేనేజ్‌మెంట్
పోలీసులను, అధికారులను అడ్డుకునే యత్నంలో స్టూడెంట్స్ ఆందోళ‌న‌
కూల్చివేతలను అడ్డుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ
తిరిగి ప్రారంభ‌మైన కూల్చివేత‌లు

కుత్బుల్లాపూర్ (ప్ర‌భ న్యూస్‌) : చెరువును చెరబట్టి ఎఫ్టీఎల్‌ అక్రమించడమే కాకుండా అందులో శాశ్వత నిర్మాణాలు, తాత్కాలిక నిర్మాణాలు, రోడ్లు, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేసి చెరువు స్వరూపాన్నే మార్చేశాడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఎమ్మెల్యే పేరుతో జ‌రుగుతున్న అక్ర‌మాలు, ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఆంధ్రప్రభ అక్షర పోరాటం చేసింది. జ్యుడీషియల్ విచారణ కూడా జ‌రిగింది. దీనిపై స్పందించిన కలెక్టర్ గౌతమ్ కబ్జాలను నేలమట్టం చేయాలని ఆదేశించారు. ఈ క్ర‌మంలో తహశీల్దార్ మతిన్, కమిషనర్ సత్యనారాయణ, ఇరిగేషన్ ఏఈఈ సారా ఆధ్వర్యంలో కూల్చివేతలు చేప‌ట్టారు. కాగా, అక్క‌డి కళాశాల యాజమాన్యం, విద్యార్థులను క‌లిసి పోలీసుల‌ను అడ్డుకునే య‌త్నం చేశారు. అధికారుల మీదికి స్టూడెంట్స్‌ని ఎగదోసి గొడ‌వపెట్టారు. దీంతో ఎఫ్టీఎల్ ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు పంచాయితీ మ‌ళ్లీ క‌లెక్టరేట్ ఆఫీసుకు చేరింది.

కూల్చివేత‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న ఏసీసీ

కాగా, విధుల్లో ఉన్న అధికారుల‌ను, పోలీసుల‌కు అడ్డుకోవ‌డం ద్వారా విద్యార్ధులపై కేసులు నమోదైతే ఏంటని సర్వత్రా విమర్శలు వ‌చ్చాయి. ఇక.. ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కృష్ణారావు కూల్చివేతలను అడ్డుకోవడం, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలేంటని ప్రశ్నించారు. కలెక్టర్ ఆదేశాలతో కూల్చివేస్తున్నామని అధికారులు చెప్పడంతో ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ కూల్చివేతలను అడ్డుకుని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం ఎంల్ ఆర్ఐటీలో కూల్చివేతలను తాత్కాలికంగా కాసేపు ఆగిపోయాయి. ఆ త‌ర్వాత తిరిగి కూల్చివేతలు ప్రారంభం కాగా. వీటిని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు..

విద్యార్థుల‌కు వాడుకుంటున్న మేనేజ్‌మెంట్‌..

యాజమాన్యం ఆదేశాల మేరకు విద్యార్దులు కూల్చివేతలకు నిరసనగా అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళనకు సైతం దిగారు. పోలీసులు హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. కాగా యాజమాన్యం కళాశాల విద్యార్థులను ఎగదోయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు పాఠాలు భోదించమని చెబితే ఆందోళన చేయాల్సిందిగా ఆదేశించడం కళాశాల ప్రిన్సిపాల్స్ దగ్గరుండి చేయించడం చూస్తుంటే ఎం ఎల్ ఆర్ ఐ టి సమాజానికి ఏమి నేర్పిస్తుందని, విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకుంటుందనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

- Advertisement -

కూల్చివేతలను అడ్డుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ

ఎం ఎల్ ఆర్ ఐ టి లో కూల్చివేతలను అడ్డుకునేందుకు గురువారం ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేకానంద గౌడ్‌, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.. మర్రి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. కూల్చివేతలు ఏక పక్షంగా ఎలా చేస్తారని నోటీసులు ఇవ్వాలి కదా అంటూ ఎమ్మార్వో మతిన్ ను ప్రశ్నించారు. కలెక్టర్ ఆదేశాలున్నాయని చెప్పినా విన‌కుండా.. కూల్చివేతలను అపాల్సిందిగా పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారని పర్సనల్ గా తీసుకుంటున్నారని ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ అన్నారు.
ప్రజా ప్రతినిధులై ఉండి.. ఇలా చెరువులో ఆక్రమణల కూల్చివేతలను అడ్డుకోవడం కరెక్ట్ కాదని స్పష్టంగా ప్రభుత్వ ఆదేశాలున్నాయని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

తిరిగి ప్రారంభమైన కూల్చివేతలు

కూల్చివేతలను అడ్డుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూల్చివేతల విషయమై కలెక్టర్‌ను కలిసేందుకు మేడ్చల్ కలెక్టరేట్‌కు వెళ్లారు.. ఏం జరిగిందో తెలియదు కాని, వారంతా తిరిగి కళాశాలకు చేరుకున్నారు. ఈ లోపే ఎం ఎల్ ఆర్ ఐటీలో తిరిగి కూల్చివేత‌లు ప్రారంభమయ్యాయి. కూల్చివేతలను ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement