Sunday, April 28, 2024

TS – మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం జప్తు – జిల్లా కోర్టు ఆదేశం

మంచిర్యాల, మార్చి 20 (ప్రభన్యూస్): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో సామాగ్రిని బుధవారం జిల్లా కోర్టు ఉత్తర్వుల మేరకు కోర్టు సిబ్బంది సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 479, 480లలో గల 23 ఎకరాల 27 సెంట్ల భూమిలో మల్బరీ యూనిట్ ఏర్పాటు కోసం అప్పటి ఆర్డీవో, ల్యాండ్ అక్వేషన్ అధికారి భూ సేకరణ చేపట్టారు. ఆ భూమికి నష్టపరిహారం చెల్లింపు విషయంలో జరిగిన జాప్యం కారణంగా ఆ భూమిని కోల్పోయిన బాధితుడు 1982లో కోర్టును ఆశ్రయించాడు.

అప్పటి నుంచి ఆ వివాదం కాస్త విచారణలో ఉంది. మొదటగా ఆసిఫాబాద్ కోర్టు, అనంతరం జిల్లా కోర్టు, ఆ తర్వాత హై కోర్టులో విచారణ జరిగింది. దీనిపై హై కోర్టు అక్టోబర్ 4న మూడు నెలల్లోగా పట్టాదారుకు రూ.2.92 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని తీర్పును వెలువరించింది. ఆరు నెలలు గడిచినా అధికారులు పరిహారం చెల్లించనందున మంచిర్యాల సబ్ కోర్టులో హై కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని పిటీషన్ వేయడంతో కోర్టు ఆదేశాల మేరకు కోర్టు సిబ్బంది ఆర్డీవో కార్యాలయంలోని కంప్యూటర్ పరికరాలు, ఫర్నిచర్, ఇతర సామాగ్రిని సీజ్ చేశారు. కాగా ప్రభుత్వ కార్యాలయంలోని సామగ్రి సీజ్ కావడం చర్చనీయాంశమైంది.

కలెక్టర్ జోక్యంతో అగిన జప్తు :
ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు విషయం తెలుసుకున్న కలెక్టర్ జోక్యం చేసుకొని సంబంధిత జిల్లా కోర్టు న్యాయమూర్తితో చర్చించినట్లు సమాచారం. దీంతో న్యాయమూర్తి జప్తును నిలిపివేయాలని తమ సిబ్బందిని ఆదేశించగా జప్తు ప్రక్రియను నిలిచిపోయింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement