Friday, April 26, 2024

కన్నతల్లికి బాలున్ని అప్పగించిన కలెక్టర్

కన్నతల్లి ఇష్టం లేకుండా అమ్మిన బాలున్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా తిరిగి కన్న తల్లికి బాలల సంక్షేమ సమితి అధికారులు అప్పగించారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో తల్లికి ఇష్టం లేకుండా అమ్మకానికి గురైన రేగొండ మండలం చెన్నాపూర్ గ్రామానికి చెందిన పసిబాలున్ని బాలల సంరక్షణ అధికారులు కన్నతల్లికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ… కన్న బిడ్డలను సంరక్షించాల్సిన తల్లిదండ్రులు వ్యసనాలకు గురైతే పిల్లల భవిష్యత్ పై ప్రభావం పడుతుందని, తల్లిదండ్రులు బిడ్డల సంక్షేమం కోసం తమ జీవితాలను త్యాగం చేయాలన్నారు. మద్యం వ్యసనానికి బానిసై తమ కొడుకును అమ్ముకున్న సంఘటన దురదృష్టకరమని, కన్నతల్లి ఫిర్యాదుతో వెంటనే స్పందించి బాలల సంరక్షణ అధికారుల ద్వారా తిరిగి బాలున్ని కన్నతల్లికి అప్పగించడం జరిగిందన్నారు. వారం రోజుల పాటు తల్లి, బిడ్డకు సఖి కేంద్రంలో ఆశ్రయం కల్పించి వారి గ్రామంలో సర్పంచ్, అంగన్వాడీ టీచర్, ఆశ కార్యకర్తలకు సమాచారం అందించి భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి సంఘటన జరగకుండా పర్యవేక్షించాలని బాలల సంక్షేమ సమితి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కే.సామ్యూల్, సీడబ్ల్యూసీ ఛైర్మన్ వేణుగోపాల్, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ శిరీష, డిసిపిఓ హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement