Sunday, May 19, 2024

Modi: దేశాభివృద్ధిలో తెలంగాణది కీలకపాత్ర: ప్రధాని మోడీ

దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుందని, తెలుగు వారి ప్రతిభ కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు.. అంటూ ప్రధాని నరేంద్ర మోడీ హన్మకొండ సభలో తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. దేశానికి ఇది స్వర్ణయుగమని, అభివృద్ధిలో దేశాన్ని ముందు వరుసలో నిలిపేందుకు కేంద్రం నిరంతరం పనిచేస్తోందని అన్నారు. వివిధ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఈ రోజు రూ.6 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించుకున్నామని తెలిపారు.

రాష్ట్రంలో పలు చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయని మోడీ చెప్పారు. కరీంనగర్‌ గ్రానైట్‌ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారం అందిస్తున్నట్లు వివరించారు. తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీని పెంచుతున్నామని, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రియల్‌-ఎకనామిక్‌ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నామని మోడీ తెలిపారు. తెలంగాణలో మొత్తం రూ.34 వేల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణం చేపట్టామని, అందులో కొన్ని ఇప్పటికే పూర్తవగా మరికొన్ని తుది దశలో ఉన్నాయని ప్రధాని చెప్పారు. తాజాగా మరో రూ.5,600 కోట్ల విలువైన రెండు జాతీయ రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు వివరించారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ల మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కు శంకుస్థాపన చేశామని చెప్పారు. కరీంనగర్ నుంచి వరంగల్ కు నాలుగు లేన్ల జాతీయ రహదారి (ఎన్ హెచ్ 563), మంచేరియల్ నుంచి వరంగల్ కు నాలుగు లేన్ల జాతీయ రహదారి (ఎన్ హెచ్ 163 జి) ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్లు మోడీ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement