Thursday, December 5, 2024

Big story : సాంప్రదాయేతర ఇంధన వనరులపై ప్రత్యేక దృష్టి.. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానం

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం సాంప్రదాయేతర ఇందన వనరులపై ప్రత్యేక దృష్టిని సారించింది. థర్మల్‌ పవర్‌కు భవిష్యత్‌లో వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిక్‌ వెహికిల్‌, ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్‌ పాలసీతో పాటు పునరుత్పాదక శక్తి, ఇంధన సంరక్షణ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తోంది. అందుకు సాంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ ( టీఎస్‌ రెడ్కో ) ద్వారా ఇప్పటీ వరకు 4,511 .77 మెగావాట్ల సోలార్‌ ఎనర్జీ, 128 మెగావాట్ల విండ్‌ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నది. దీంతో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. సోలార్‌, విండ్‌ ఎనర్జీని పెంచడంతో పాటు విద్యుత్‌ను ఆదా చేసేందుకు గాను పరికరాలు, బల్బుల వాడకాన్ని కూడా టీఎస్‌ రెడ్కో ప్రోత్సహిస్తున్నది. పునరుత్పాదక ఇంధన కార్యక్రమం కింద ఉత్పత్తి చేస్తున్న 4,511.77 మెగావాట్ల సౌర శక్తిని వికేంద్రీకృత పంపిణీ ఉత్పత్తి విధానంలో పూర్తిగా అభివృద్ధి చేయబడిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

ఎల్‌ఈడీ బల్బులతో గ్రామాల్లో వీధిలైట్లు..

విద్యుత్‌ ఖర్చును తగ్గించి.. ఆదా చేసేందుకు సమర్థవంతమైన విద్యుత్‌ పరికరణాలను అమర్చుతున్నారు. డిమాండ్‌ సైడ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్టివిటీ కింద ఎల్‌ఈడీ స్ట్రీట్‌ లైట్లను విద్యుత్‌ శాఖ ఏర్పాటు చేస్తున్నది. వాణిజ్య భవనాల కోసం ఇంధన పరిరక్షణ బిల్డింగ్‌ కోడ్‌ను ప్రభుత్వం అమలు చేస్తున్నది. వీటిపై వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలను కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ విద్యుత్‌ సంరక్షణ కార్యకలాపాలతో రాష్ట్రంలో 1005 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ రాష్ట్రంలో ఆదా అయిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఆదా ఆయిన విద్యుత్‌ విలువ 3.30 లక్షల మెట్రిక్‌ టన్నుల చమురు ( విద్యుత్‌, ఉష్ణ శక్తి రెండింటిని కలిగి ఉంటుంది) శక్తికి సమానంగా ఉంటుంది. అంతే కాకుండా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోని వీధి లైట్లు ప్రస్తుతం ఎక్కువగా విద్యుత్‌ లోడును తీసుకునేటివి ఉన్నాయి. వాటి స్థానంలో ఎనర్జీ ఎఫిషియెంట్‌ ఎల్‌ఈడీ వీధిలైట్లను అమర్చే కార్యక్రమానికి విద్యుత్‌ శాఖ శ్రీకాకం చుట్టింది. ఈ ఎల్‌ఈడీ లైట్లను అమర్చడం వల్ల ఇంధన పొదుపులో 50 శాతం వృద్ధిని సాధించేందుకు అవకాశం ఉందని విద్యుత్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 32 వేల ఈవీ వాహనాలు..

రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజ్‌ సొల్యూషన్‌ పాలసీ-2020 ‘ ని రూపొందించింది. ఈ విధానంలో భాగంగా మొదటి 2 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలకు సంబంధించి మొదటి 5 వేల యూనిట్లకు రోడ్డు పన్నులు, రిజిస్ట్రేషన్‌ ఫీజులో 100 శాతం రాయితీని కల్పించిన విషయం తెలిసిందే. దివిటిపల్లిలో ప్రత్యేకమైన ఎనర్జీ పార్కును ఏర్పాటు చేయడంతో పాటు రావిర్యాల, మహేశ్వరంలో ఇప్పటికే ఉన్న ఎలక్ట్రికల్‌ మోటార్‌ కంపెనీలను కూడా ఉపయోగించుకుంటున్నాయి. దీంతో రాష్ట్రంలో దాదాపుగా రూ. 30 వేల కోట్ల పెట్టుబడులతో 1.2 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందనే అంచనాతో ఉన్నారు. ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ పాలసీ అమలుతో కార్బన్‌ ఉద్గారాల తగ్గింపు 6.61 టెర్రా గ్రాముల ( 661 కోట్ల కిలోలు ) వరకు ఉంటుందని అంచనా వేయబడింది. ఎలక్ట్రిక్‌ వాహనాలు ఇప్పటికే రాష్ట్రంలో 32 వేల వరకు రోడ్లపై తిరుగుతున్నాయి. ప్రస్తుతం 156 ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు పని చేస్తున్నాయి. మరో 100 ఎలక్ట్రికల్‌ వెహికిల్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు పురోగతిలో ఉన్నాయి. టీఎస్‌ రెడ్కో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మరో 1000 ఛార్జింగ్‌ పాయింట్లను పీపీపీ పద్దతిలో ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement