Sunday, April 28, 2024

Delhi: ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలి.. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీల నిరసన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రానికి వరద సాయం, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఇతర ప్రజా సమస్యలపై తక్షణమే పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక చర్చకు అనుమతించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే.కేశవరావు , టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు నేతృత్వంలో బుధవారం పార్టీ ఎంపీలతో పాటు విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఎంపీల సస్పెన్షన్‌ను  వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో చర్చించాలని పట్టుబట్టినందుకు ఎంపీలను నస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. వెంటనే రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎంపీలు ఉభయసభల్లో ప్రకార్డులు పట్టుకుని కేంద్ర వైఖరిపై నిరసన తెలిపారు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. తిరిగి సమావేశాలు ప్రారంభమైనా అదే పరిస్థితి పునరావృతమైంది. ఆందోళన కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్ సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదరరావు, బండి పార్థసారథిరెడ్డి, మన్నే శ్రీనివాసరెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి , మాలోత్ కవిత, బోర్లకుంట వెంకటేశ్ నేత, పోతుగంటి రాములు, పనుసూరి దయాకర్ తదితరులతో పాటు విపక్షాల ఎంపీలు కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement