Monday, April 29, 2024

ద‌మ్ముంటే మోడీని తిట్టిండి, వైసీపీ, టీడీపీ వీర్రాజు సవాల్‌.. జనసేనతో మిత్రపక్షంగానే ఉంటామ‌న్న సోము

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వైసీపీ, తెదేపా గూడుపుఠాణి రాజకీయాలు నడుపుతున్నారంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. బీజేపీ బలపడకూడదని ఇద్దరూ కలిసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నాటకమాడుతున్నారని చెప్పారు. ఆ రెండు పార్టీల నేతలకు దమ్ముంటే తాము చేస్తున్న ఆరోపణలకు కౌంటర్‌ ఇస్తూ మోడీ పాలనను తిట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అధ్యక్షునిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గత ప్రభుత్వంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించడంతో పాటు తద్వారా జరిగే మేలును ప్రస్తావిస్తూ కేంద్రాన్ని ప్రశంసించినట్లు వీర్రాజు చెప్పారు. ఇప్పుడేమో ఆ పార్టీ ఎంపీ పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి మాట్లాడతున్నారని తెలిపారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ రూ.వేల కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు. ఓ వైపు కేంద్రం నుంచి నిధులు తీసుకుంటూనే మరోవైపు ప్రత్యేక హోదా అంటున్నారని మండిపడ్డారు. హోదాను బూచిగా చూపుతూ బీజేపీపై నిందలు మోపుతూ రాష్ట్రంలో ఎదగకుండా ఆ రెండు పార్టీలు మోకాలడ్డుతున్నాయని తెలిపారు. ఇకపై ఈ తరహా పరిణామాలను సహించేది లేదని చెపుతూ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేయాలని సవాల్‌ విసిరారు.

ఏపీలో బీజేపీ బలపడుతుందని చెపుతూ మరింతగా ఎదిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు గుర్తించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రెండు పంటల ద్వారా రూ.50వేల కోట్ల సంపద సమకూరుతుందన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తికి రెండు పార్టీలు సహకరించడం లేదని తెలిపారు. వైసీపీ, తెదేపాలు గాలేరీ-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టుల ఊసే ఎత్తడం లేదని ఆయన పేర్కొన్నారు. దీనిని బట్టే వారిమధ్యనున్న సాన్నిహిత్యం అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. మద్యం, మట్టి, ఇసుక మాఫియాతో రాష్ట్ర సంపదను దోచుకుంటున్నట్లు వీర్రాజు ఆరోపించారు. అప్పులు తేవడం మినహా మూడేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమంటూ ఏపీ అభివృద్ధి చెందాలంటే బీజేపీ పాలన రావాలనే విషయం ప్రజలు గుర్తించాలన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్మోహన రెడ్డిని ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం వస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

మేమే నిజమైన ప్రతిపక్షం..
రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం బీజేపీనేనని సోము వీర్రాజు తెలిపారు. ఆలయాలపై దాడులు చేస్తే సీఎం కళ్లు తెరిచి నిలువరించే చర్యలు చేపట్టారన్నారు. టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై కోర్టు వెళ్లింది కూడా బీజేపీనేనని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే అభ్యర్థి చనిపోతే పోటీ ఎలా పెడతారంటూ ప్రశ్నించిన జగన్‌, అంతకు ముందు నంద్యాల ఎన్నికల్లో అభ్యర్థిని ఎలా పెట్టారని ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నించే అర్హత జగన్మోహన రెడ్డికి లేదన్నారు. మాయ మాటలు, మోసాలతో పాలన చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. చివరకు కేంద్రం నుంచి వచ్చే స్థానిక సంస్థల నిధులను కూడా దారిమల్లిస్తే తమ పార్టీ సభ్యులు రాజ్యసభలో ప్రస్తావించాల్సి వచ్చిందన్నారు. లేచింది మొదలు కేంద్రంపై అసత్య ప్రచారాలు చేసే జగన్మోహన రెడ్డి విషయాన్ని కేంద్రమంత్రులకు వివరించామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో బీజేపీ ఎప్పుడూ ముందుండి పోరాడుతుందని ఆయన తెలిపారు.

మా వ్యూహాలు మాకున్నాయి..
రాష్ట్రంలో బీజేపీకే ప్రత్యమ్నాయ అవకాశాలు ఉన్నట్లు సోము వీర్రాజు తెలిపారు. తాము జనసేనతో మిత్రపక్షంగా ఉంటూనే ముందుకు సాగుతామని చెప్పారు. మిత్రపక్షమైనప్పటికీ ఎవరి పార్టీ కార్యాచరణ వారికి ఉంటుందని వీర్రాజు తెలిపారు. తాము కూడా అందుకు అనుగుణంగానే ముందుకెళతామని చెపుతూ తమ వ్యూహం తమకుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధ్యక్షుడెవరనేది అధిష్టానం నిర్ణయమే తప్ప పత్రికలు కాదన్నారు. తన వయసు అయిపోయిందని, తీసేస్తారని రాస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై వాస్తవాలు చెపుతున్నాను కాబట్టే తాను అందరికీ, చివరకు పత్రికలకు కూడా కనిపిస్తున్నానని ఆయన చెప్పారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement