Tuesday, April 16, 2024

విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటనకు ప్లాన్‌.. వరద బాధితులతో ముఖాముఖి

అమరావతి, ఆంధ్రప్రభ: పోలవరం విలీన మండలాలలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు రోజులపాటు పర్యటించనున్నారు. గురువారం, శుక్రవారాల్లో మొత్తం ఏడు మండలాల్లో చంద్రబాబు పర్యటన జరగనుంది. గురువారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి వరద ప్రాంతాల పర్యటనకు బయలుదేరతారు. మొదటి రోజు రాష్ట్రంలో విలీనమైన వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో చంద్రబాబు విస్తృతంగా పర్యటించి, వరద బాధితులతో ముఖాముఖి కానున్నారు.

శివకాశీపురం, కుకునూరులలో ఆయన పర్యటన సాగనుంది. అలాగే తెలంగాణలోని భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్‌ మండలంలోని ముంపు ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటిస్తారు. సారపాకలో చంద్రబాబు రోడ్‌ షో నిర్వహించనున్నారు. రెండో రోజు ఎటపాక, కూనవరం, వీఆర్‌ పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. తొలి రోజు పర్యటన అనంతరం చంద్రబాబు భద్రాచలంలోనే బస చేయనున్నారు. మరుసటి రోజు భద్రాద్రి సీతారాములను దర్శించుకుని, మిగిలిన ప్రాంతాల్లో ఆయన పర్యటన చేపట్టనున్నారు.

చంద్రబాబు పర్యటనపై ఆసక్తి..
ఇదిలా ఉంటే చంద్రబాబు ముంపు పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు హయాంలోనే పోలవరం ప్రభావిత మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కేంద్ర ప్రభుత్వం విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వరదల నేపథ్యంలో తెలంగాణ బోర్డర్‌లో ఉన్న ముంపు మండలాల ప్రజలు తమను యథావిధిగా తెలంగాణలోనే కొనసాగించాలని ఆంధ్ర నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వరదలతోనే కాకుండా.. ఇతర పాలనాపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నామని వారు చెబుతున్నారు. ఒకవైపు తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా ఇదే నినాదాన్ని ఎత్తుకున్నారు. విలీన మండలాలను తమకు అప్పగించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

అలాగే ఏపీ మంత్రులు కూడా ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. భద్రాచలాన్ని కూడా ఏపీకి అప్పగించాలని కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వరద బాధితులు, విలీన మండలాల ప్రజలు చంద్రబాబుకు ఎలాంటి విజ్ఞప్తులు చేయనున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది. అదే విధంగా చంద్రబాబు కూడా ఏ విధంగా స్పందిస్తారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement