Tuesday, April 30, 2024

Summer Special: మండుటెండల్లో చల్లని నేస్తాలు.. వేసవి తాపం తీర్చే మందులు

అందరూ మండుటెండలను చూసి భయపడతారు.. అబ్బో ఈ వేసవి ఎలా గడుస్తుందంటూ బెంబేలెత్తిపోతారు. కానీ ఏడాదికోసారి వచ్చే వేసవి కోసం చిరు వ్యాపారులు ఎదురుచూస్తారు. మండే వేసవి వారికి నాలుగు కాసులు అందించే కాలం.. వారే వేసవి తాపానికి చల్లని మందులు ఇచ్చే శీతలపానియాలు, పండ్ల రసాల వ్యాపారులు, రంజన్‌ల అమ్మకందారులు. గత కొన్ని రోజులుగా వేసవి తాపం రోజు రోజుకు పెరుగుతుంది. మీరేం భయపడకండి… మేమున్నాం అంటూ కొబ్బరి బొండాలు, తర్బూజాలు పలకరిస్తున్నాయి. గత వారం రోజుల నుండి ఎండ తీవ్రత పెరిగిన కొద్ది పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు, శీతలపానియాలు, తర్బూజాలకు గిరాకీ పెరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలోని అన్ని పట్ట ణాల్లోని ప్రధాన కూడళ్లల్లో జ్యూస్‌ స్టాళ్ల దుకాణాలు వెలిశాయి.

ప్రతి ఏడాది మాదిరిగానే బెంగూళూర్‌, రాజమండ్రిల నుండి కొబ్బరి బొండాలు, కాగజ్‌నగర్‌, హైదరాబాద్‌ ప్రాంతాల నుండి తర్బూజాలు అమ్మకానికి వస్తున్నాయి. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు పండ్ల రసాలు, తర్బూజాలు, కొబ్బరిబొండాలతో సేద తీరుతున్నారు ప్రజలు. చల్లదనాన్నిచ్చే వాటర్‌ మిలన్‌ల కొనుగోళ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. పేదింటి ఫ్రీజ్‌గా పేరొందిన ఆదిలాబాద్‌ రంజన్‌ల వ్యాపారం జోరందుకుంది. వ్యాపారం మార్చిలోనే ఊపందుకోవడంతో పండ్ల రసాలు, తర్‌బుజలు, కొబ్బరిబొండాల వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కూడళ్ళల్లో వెలసిన జ్యూస్‌ స్టాళ్లల్లో ఆపిల్‌, పైనాపిల్‌, గ్రేప్‌, సపోట, బనాన, క్యారేట్‌, వాటర్‌ మిలన్‌, స్టాబేరి, తదితర పండ్ల రకాల రసాలు లభ్యమవుతున్నాయి. వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే కూలర్లను పెద్దపల్లిలో ఈ ఏడాది ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఏప్రిల్‌కు ముందే ఎండలు రోజురోజుకు ముదురుతున్నాయి.. ఉదయం 7 గంటలకే భానుడు భగ భగ మండుతూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.

ఒకప్పుడు రాత్రి 7 గంటలు అని పిలిచే వారు.. ప్రస్తుతం సాయంత్రం 7 గంటలు అనేలా పరిస్థితి మారింది. 7 గంటలైనా సూర్యాస్తమయం కాకపోవడమే ఇందుకు కారణం. అంటే రోజుకు ఉన్న 24 గంటల్లో భానుడు 12 గంటలు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.. ఫలితంగా ఏప్రిల్‌ 2వ వారంలో కనిపించే శీతలపానీయాల దుకాణాలు మార్చి మొదటి వారంలోనే కోకొల్లలుగా వెలిశాయి.. ఎండి వేడి నుండి తట్టుకునేందుకు ప్రజలు ఎసిలు, కూలర్ల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నారు.. ఫలానా దుకాణం అని లేకుండా అడుగడుగునా కూలర్లు విక్రయిస్తున్నారు..ఎలక్ట్రానిక్‌ దుకాణాల్లో ఎసిల గిరాకీ పెరిగింది.. నిన్న మొన్నటి వరకు ఎసిలపై రాయితీలు ఇచ్చిన కంపనీలు ప్రజల అవసరాలను గమనించి ధరలు పెంచడమే కాకుండా క్యాష్‌ అండ్‌ క్యారీ అంటున్నారు.. ఎండ నుండి తట్టుకునేందుకు ప్రజల జీవన శైలిలో కూడా మార్పు వచ్చింది.. నెత్తిన టోపీ, కాటన్‌ వస్త్రాలు ధరించడం రోజురోజుకు పెరుగుతుంది. వర్షాకాలంలో కనిపించే గొడుగులు, పగటి పూట ప్రజల చేతిల్లో దర్శనమిస్తున్నాయి.. బ్రాండెండ్‌ కూలర్ల ధరలు చుక్కలనంటడంతో నాగ్‌పూర్‌ కూలర్లపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.. మధ్య తరగతి ప్రజలు ఫ్రి జ్‌ల కొనుగోళ్లపై ఆసక్తి కనబరుస్తుండగా, పేదలు ఆదిలాబాద్‌ రంజన్‌లపై మక్కువ చూపుతున్నారు.. చల్లదనాన్ని ఇచ్చే వాటర్‌ మిలన్‌ల అమ్మకాలు జోరందుకున్నాయి.. ప్రధాన కూడళ్ల వద్ద వెలిసిన శీతల పానీయాల దుకాణాలు కలకలలాడుతున్నాయి.. ఎండ వేడి నుండి తట్టుకునేందుకు ప్రజలు కొబ్బరి బోండాలను సేవించేందుకు ఆసక్తి చూపుతున్నారు.. ఎండ వేడిమి ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్‌, మే నెలల సంగతి ఎలా ఉంటుందోనని ప్రజలు జంకుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement