Friday, May 3, 2024

జలాశయాల్లో.. సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు..? 5 వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ ప్లాంటు ఏర్పాటుకు యోచన

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే వినియోగదారుల ఇళ్లపై ( రూప్‌టాఫ్‌) సోలార్‌ పలకాల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సీడిలు ఇచ్చి ప్రొత్సహిస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు ప్రభుత్వం కూడా తక్కువ ఖర్చుతో సౌర విద్యుదుత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లపై ఐదువేల మెగావాట్ల సామర్థ్యంతో ‘ ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ‘ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 5,400 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. పనరుత్పాదక విద్యుత్‌ కొనుగోళ్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను పెట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ పవర్‌పైన ప్రత్యేక దృష్టిని సారించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్లు, లోయర్‌ మానేరు వంటి జలాశయాలపై ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్య సాధ్యాలపై రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ( టీఎస్‌ రెడ్కో ), నీటిపారుదల శాఖ చర్చలు జరుపుతున్నాయి. అయితే ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని సంబంధిత శాఖల అధికారులు చెబుతున్నారు.

రామగుండంలో ఇప్పటికే 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌ ప్లాంటు..

రాష్ట్రంలో ఇప్పటికే రామగుండంలో ఎన్టీపీసీ, జైపూర్‌లో సింగరేణి సంస్థలు తమ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు నీటిని సరఫరా చేసే జలాశయాలపై ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను నిర్మంచాయి. రామగుండంలోని 500 ఎకరాల జలాశయంపై ఎన్టీపీసీ 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ను నిర్మించింది. అదే మల్లన్న సాగర్‌ జలాశయం 22 వేల ఎకరాలు ఉంటుంది. మిగతా జలాశాయాలు కూడా వేలాది ఎకరాలు ఉంటాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని రిజర్వాయర్లపై 5 వేల మెగావాట్ల మేర సౌర విద్యుత్‌ ప్లాంట్ల స్థాపించడానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జలాశయాలపై ఫ్లోటింగ్‌ ప్లాంట్ల ఏర్పాటుతో స్థలం అద్దె రూపంలో నీటిపారుదల శాఖకు ఆదాయం సమకూరడంతో పాటు కాళేశ్వరం వంటి భారీ లిప్టులకు చౌకగా విద్యుత్‌ లభిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది.

- Advertisement -

భూసేకరణ సమస్య నుంచి విముక్తి..

భారీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు వేల ఎకరాల భూములు అవసరం ఉంటుంది. రాష్ట్రంలో భూముల కొరత తీవ్రంగా ఉంది. భూముల ధరల భారీగా పెరిగిపోయాయి. సౌర విద్యుత్‌ ప్రాజెక్టులకు భూ సేకరణ చేయడం ప్రస్తాత పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదు. భారీ వ్యయంతో భూములు కొని పెట్టుబడి పెట్టినా దాని వల్ల పెట్టుబడి వ్యయం పెరిగి.. విద్యుత్‌ ధరలు భారీగా పెరిగిపోతాయి. అదే ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లతో భూ సేకరణ సమస్య తప్పుతుంది. విద్యుత్‌ ధర కూడా తక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు జలాశయాలపై ప్లాంట్ల ఏర్పాటుకు త్వరలోనే టెండర్లు ఆహ్వానించి.. ప్రయివేట్‌ డెవలపర్లకు బాధ్యత అప్పగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement