Saturday, May 4, 2024

GO 317ను రద్దు చేయాల్సిందే: సీతక్క

ఉద్యోగుల ఊపిరి తీస్తున్న GO 317ను  రద్దు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో 317 జీఓను రద్దు చేయాలని కోరుతూ ములుగు జాతీయ రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విషయంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన బదిలీలను చేపట్టాలి కోరారు. స్థానికత ఆధారంగా రిక్రట్మెంట్ అయిన ఉద్యోగులకు స్థానికంగానే ప్రాధాన్యత కల్పించాలన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉన్న చోట ఉండనివ్వకుండా ఉద్యోగులతో చెలగాటం ఆడుతున్నారు అని మండిపడ్డారు. ఉద్యోగుల అలాట్మెంట్ ప్రక్రియలో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుని 317 జీవో రద్దు చేయాలన్నారు. బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోతో ఎంతో మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలు చిన్నాభిన్నమై శాశ్వతంగా వాళ్ల స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర పోరాటానికి మూల సిద్ధాంతమైన స్థానికతను మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మె, మానవహారం, సహాయ నిరాకరణ లాంటి వీరోచిత పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత నేడు ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పక్కకు పెట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న నాలుగు డిఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.  సిపిఎస్ ను రద్దు పరిచి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలని సీతక్క కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement