Thursday, May 2, 2024

సాగునీటి ప్రాజెక్టులకు రూ.32వేల కోట్లు…

హైదరాబాద్‌, సాగునీటి ఎత్తిపోతల పథకాలు ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేసేలా ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాలనే ప్రతిపాదనలు ఇరిగేషన్‌ శాఖ నుంచి అందు తున్నట్లు తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి వీటన్నింటినీ పూర్తి చేసేలా ప్రభుత్వం గడువును నిర్దేశించుకున్న నేపథ్యంలో భారీగా నిధులు కేటాయించేలా కార్యాచరణ జరుగుతున్నది. ఇప్పటికే అన్ని ప్రాజెక్టులకు చెందిన చీఫ్‌ ఇంజనీర్ల నుంచి ప్రభుత్వం తెప్పించుకున్న అంచనాల మేరకు ఆర్థిక శాఖకు ప్రతిపాదించే అంచనాల విలువ రూ.32 వేల కోట్లకు పైగా ఉందని సమాచారం. ఈ ఏడాది కీలకమైన అన్ని పథకాలను పూర్తి చేసేలా 2021-22 బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సి ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో 2 టీఎంసీలకు సంబంధించిన పనులను డిసెంబర్‌ చివరకు, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను ఆగష్టుకు పూర్తి చేసేలా కార్యాచరణ నిర్దేశించుకున్నారు. ఈ రిజర్వాయర్‌తోపాటు కాల్వలు, కొండపోచమ్మ సాగర్‌ కింది కాల్వలు, గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్‌లు కూడా పూర్తి చేయనున్నారు. అద నపు టీఎంసీల పనులను కూడా పనిలో పనిగా పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో రుణాలు, రాష్ట్ర బడ్జెట్‌ నుంచి రూ.8 వేల కోట్లు వీటికి కేటాయింపులు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలు, వడ్డీలు, విద్యుత్‌ ఖర్చులు కలుపుకుని రూ.2 వేల కోట్లు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లు కోరుతున్నారని తెలిసింది. డిండికి రూ. 2 వేల కోట్లు, దేవాదులకు రూ.2500 కోట్లు, ఎస్‌ఎల్‌బీసీకి రూ.1500 కోట్లు, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులకు రూ. 3000 కోట్లు ప్రతిపాదించనున్నారని తెలిసింది.
ఆదిలాబాద్‌ జిల్లా ప్రాజెక్టులకు రూ. 1000 కోట్లు, ఇతర చిన్నా చితకా పనులకు కులుపుకుని మొత్తంగా రూ.32 వేల కోట్ల మేర ప్రతిపాదించే అవకాశాలున్నాయని తెలిసింది. ప్రభుత్వం ఈ ఏడాది చివరి దశలోని పనులకు మాత్రమే నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. మిగతా పనులను పక్కనపెట్టి ప్రాధాన్యతా క్రమంలో అందుబాటు నిధులు, అవసరం మేరకు వచ్చే సంవత్సరం నిధులు విడుదల చేయనుందని తెలిసింది. ఒక్కో శాఖ నుంచి అందే ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌ చర్చించిన తర్వాతే తుది ఆమోదం తీసుకోనున్నారు.
అవసరమైతే రుణసమీకరణ
సాగునీటి రంగాన్ని పరుగులు పెట్టించే లక్ష్యంతో బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం అవసరమైతే రుణ సమీకరణకు కూడా వెనుకాడటం లేదు. ఈ దిశలో ప్రత్యేక కార్పొరేషన్లకు ఆశించిన రుణం అందేలా చర్చలు సఫల మవుతు న్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌ల తోపాటు ఎల్లంపల్లి దిగువన ఉన్న మల్లన్నసాగర్‌ వరకు ఉన్న అన్ని బ్యారేజీలను పూర్తిచేసేలా సర్కార్‌ కదులుతోంది. ఏడాదిన్నరలో పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోత ల పథకాలను పూర్తిచేసేలా ప్రణాళికాబద్దంగా ప్రభుత్వం నిధు లు సమీకరిస్తోంది. ఏడాదిలో ప్రాజెక్టుల ద్వారా నీరందించేలా ఆర్థిక వనరుల సమీకరణకు ప్రభుత్వం దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే నిధుల కొరత లేకుండా పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రుణాలను తీసుకుంటోంది.
మొదటి నుంచీ
ప్రాజెక్టులకే ప్రాధాన్యత…
2018-19లో సాగునీటి రంగానికి రూ. 25 వేల కోట్లు, 2019-20లో, 2020–21లో కూడా భారీ మొత్తాలనే ఇరిగేషన్‌ రంగానికి కేటాయించారు. ఇందులో ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్టు నిధుల సమీకరణకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ ద్వారా రూ. 10,476 కోట్ల రుణాలు తీసుకుని బిల్లులు చెల్లించారు. సీతారామ, దేవాదుల ఎఫ్‌ఎఫ్‌సీ, ఎస్సీరెస్పీ-2లను కలిపి ఏర్పాటు చేసిన మరో కార్పొరేషన్‌ ద్వారా రూ.2439 కోట్లు రుణంగా సేకరించారు. మొత్తంమీద రూ.13 వేల కోట్లను రుణాలుగా సేకరించగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లిస్తూ వస్తోంది. బడ్జెట్‌లో పేర్కొనకుండా ప్రత్యేకంగా కార్పొరేషన్లకు తెస్తున్న రుణాల్లో ప్రభుత్వ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యతగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement