Sunday, April 28, 2024

పేదల భూములు లాక్కుంటారా? ఇది ఎక్కడి న్యాయం?

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో తమకు ప్రభుత్వమిచ్చిన భూమిని.. పట్టణ ప్రకృతివనం పేరిట లాక్కోవటాన్ని తప్పుబడుతూ కొందరు పేదలు గత వారం రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసనకారులను పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించడం వివాదాస్పదంగా మారింది.  అధికారులు వచ్చి ఎక్కడ తమ భూమిని ఆక్రమించుకుంటారోనన్న ఆందోళనతో… బాధితులు రక్షాబంధన్ కార్యక్రమాన్ని కూడా భూమి దగ్గరే నిర్వహించారు. గత వారం రోజులుగా తమ భూముల వద్దే ఉంటున్నారు. దీంతో బుధవారం అధికారులు వారిని బలవంతంగా ఖాళీ చేయించారు.  తమకు 516 సర్వే నంబర్ లో ప్రభుత్వం భూములిచ్చిందని బాధితులు చెబుతున్నారు. ధరణిలో తమ పేరుపైనే భూమి ఉన్నా.. రైతుబంధు అందుతున్నా.. అక్రమంగా లాక్కుని పట్టణ ప్రకృతివనం పేరిట చెట్లు నాటుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు బాధితులకు స్థానిక కాంగ్రెస్ నాయకులు అండగా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు… బాధితులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఉద్రికత్త నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అరెస్ట్ చేశారు. సర్కారు ఇచ్చిన భూమిని లాక్కొమ్మని.. ముఖ్యమంత్రి చెప్పారా ? టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందా ? అని అడ్లూరి ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారమంతా మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, కలెక్టర్ కలిసే నడుపుతున్నారంటూ ఆరోపించారు. బాధితుల భూములు బలవంతంగా లాక్కుంటే.. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement