Monday, April 29, 2024

తెలంగాణ కాల‌నాగు రేవంత్ రెడ్డి – ఎమ్మెల్యే పైళ్ల‌

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి – రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్తు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణ కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రైతుల పై ఏమాత్రం ప్రేమ లేదని అర్ధమయ్యిందని చెప్పారు.

రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అందిస్తున్న 24గంటల ఉచిత విద్యుత్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఏనాడు ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కి పెట్టిన రేవంత్ రెడ్డి నేడు బంగారు తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నాడని అన్నారు.

పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వివక్ష చూపుతున్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికలలో రైతులే కరెంట్ షాక్ ఇస్తారని పేర్కొన్నారు. మొన్న ధరణి వద్దన్నారు, నేడు ఉచిత విద్యుత్ వద్దంటున్నారు, రేపు రైతు బందు, రైతు భీమా వద్దంటారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులు, ప్రజలు ఆలోచించాలని, తెలంగాణ రాష్ట్ర రైతంగానికి రేవంత్ రెడ్డి వేంటేనే క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement