Saturday, April 27, 2024

DSP జాబ్ కు రాజీనామా చేసిన నళినికి ఆదే ఉద్యోగం ఇవ్వండి – రేవంత్ ఆదేశం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి అన్నారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా వుంటే అదే హోదాలో వేరే శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింపజేయకూడదని అధికారులను సీఎం ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

పారదర్శకంగా నియామకాలు చేపట్టండి

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియామకాలు చేపట్టాలని పోలీస్‌ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అత్యంత పారద్శకంగా, అవకతవకలకు తావులేకుండా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారాయన. హోంగార్డుల నియామకాలను కూడా చేపట్టాలన్నారు. అలాగే.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన నియామాకాల పై నివేదిక ఇవ్వాలని కోరారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ లాగే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు ఉంటుందని, ఉత్తర, దక్షిణ తెలంగాణ లో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు.

టైం టు టైం ఆలోచన చేయండి

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సచివాలయ అధికారుల్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అలా వచ్చే ప్రజల కోసం మంత్రుల ఛాంబర్‌లో నిర్దిష్టమైన టైం ఏర్పాట్లపై అధ్యయనం చేయాలని సూచించారాయన. అలాగే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటివారంలో ఒకట్రెండు రోజులపాటు సభలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తే.. అక్కడి ప్రజలు హైదరాబాద్‌ దాకా వచ్చే పరిస్థితి ఉండదని అన్నారు. ప్రతీ నెల మొదటి వారంలో రెండు రోజులపాటు సభలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కరానికి చోరవ చూపాలని అధికారులకు సూచించారాయన. అలాగే.. ఫిర్యాదుల్ని డిజిటలైజేషన్‌ చేయాలని, ప్రజా వాణికి వస్తున్న స్పందన దృష్ట్యా ఇంకా టేబుల్స్‌ పెంచాలని అధికారులకు చెప్పారు. అవసరం అయితే శిక్షణ లో ఉన్న ఐఎఎస్ ల సేవలను వినియోగించుకోవాలన్నారు.

ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవీ గుప్తా, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస రావు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, సీఎంఓ అధికారులు శివధర్ రెడ్డి, శేషాద్రి, షా-నవాజ్ కాసీం, ఆర్థిక శాఖా కార్యదర్శి శ్రీదేవి, నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement