Sunday, April 28, 2024

TS: రైతు బంధుకు అనుమ‌తిపై రేవంత్ ఫైర్…

రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జ‌మ చేసేందుకు ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి ఇవ్వ‌డాన్ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి త‌ప్పు ప‌ట్టారు. పోలింగ్ కు వారం రోజులే గ‌డువు ఉన్న‌ప్పుడు ఎలా ఆదేశాలు ఇస్తుందని ప్రశ్నించారు. పోలింగ్ కు ముందు రైతు డబ్బులు వేస్తున్నారంటనే.. అనుమతి వచ్చింది అంటేనే అర్థం అవుతుంద‌ని,.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటే అని.. ఇంత కంటే సాక్ష్యం ఏం కావాలి అంటూ ప్రశ్నించారాయన. రైతుల ఖాతాల్లో రైతు బంధు వేస్తున్నారని.. దీని వల్ల ఒక్కో రైతు 5 వేల రూపాయల వరకు నష్టపోతున్నార‌ని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రైతు బంధు రిలీజ్ చేసి ఉంటే.. మరో ఐదు వేల రూపాయలు అదనంగా వచ్చేవన్నారు రేవంత్ రెడ్డి. రైతు బంధు డబ్బులు తీసుకోవాలని.. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వేయాలని.. కాంగ్రెస్ వస్తే ఎకరానికి 15 వేల రూపాయలు వేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

2018 ఎన్నికల్లోనూ ఇదే తరహాలో పోలింగ్ జరిగే ముందు రోజు రైతు బంధు నిధులు విడుదల చేశారని.. మళ్లీ అదే తరహాలో ఇప్పుడు రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారని.. అప్పటి నుంచే కేసీఆర్, మోడీ బంధం బలంగా ఉందని.. ఇప్పుడు అది మరోసారి రుజువు అయ్యిందన్నారు రేవంత్ రెడ్డి. ఓటింగ్ ముందు రైతు బంధు వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. ఈ విషయాన్ని రైతులందరూ గమనించాలని కోరారు. బీజేపీలో ఉన్నప్పుడు వివేక్ వెంకటస్వామి రాముడుగా ఉన్నాడని, ఇప్పుడు అతనిపై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలకు, కుట్రలకు ఇదే నిదర్శనం అన్నారు రేవంత్ రెడ్డి.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బంధువైన పాపానికి రఘురాంరెడ్డిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. మాజీ ఏఐఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ సలహాదారుడు అయిన ఏకే గోయల్ ఇంట్లో వెయ్యి కోట్లు పంపిణీ జరిగిందని.. మేం ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవటం లేదని నిలదీశారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారని.. బీఆర్ఎస్ పార్టీకి.. బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తుందని.. జరుగుతున్న పరిణామాలపై నిజానిజాలు తెలుసుకుని.. కేసీఆర్ కుట్రలు గమనించి.. విచక్షణతో.. విజ్ణతతో ఓటు వేయాలని తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement