Sunday, April 28, 2024

పేదలకు కార్పొరేట్ వైద్యం : మంత్రి సబితారెడ్డి

తెలంగాణా రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం, విద్యను కార్పొరేట్ స్థాయికి మించి అందించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆరోగ్య మేళాను ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… రంగారెడ్డి జిల్లాలోని 5 డివిజన్లలో ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా విలసిల్లుతుందన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఆర్థిక ఇబ్బందుల పాలుజేసే వైద్యం, విద్య ను ప్రభుత్వం కార్పోరేట్ స్థాయికి తీసుకువచ్చి అందుబాటులో ఉంచాలనే ప్రక్రియలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగా నగరం నలువైపులా టీమ్స్ లాంటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నెలకొల్పుతున్నామ‌న్నారు. రంగారెడ్డి జిల్లాకు రానున్న కాలంలో వైద్య కళశాల ఏర్పాటుకు బడ్జెట్ లో ప్రకటించడం జరిగిందని మంత్రి తెలిపారు. దవాఖానాకు పోతే డాక్టర్ ఫీజు కన్నా వివిధ రకాల ఫీజులు భారంగా మారటం తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల పరీక్షలు పూర్తి ఉచితంగా జరిగేలా డయాగ్న‌స్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయటం జరిగిందని, చేవెళ్లలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. కోవిడ్ సందర్భంగా తలెత్తిన పరిస్థితులతో నేడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అనేక ఆధునిక సౌకర్యాలు కల్పించటం జరిగిందని, దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక్కసారి అయినా హెల్త్ చెకప్ చేయించుకోవాలన్నారు. కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మీ అందరి పాత్ర ఎంతో గొప్పదని, వైద్య సిబ్బందిని ప్రశంసించారు. ఫ్రంట్ లైన్ వర్కర్లుగా కనిపించే దేవుళ్లుగా డాక్టర్లు, ఇతర సిబ్బంది నిలిచారన్నారు. జ్వర సర్వేలో ఆశల పనితీరు అమోఘమ‌ని మంత్రి అన్నారు. వైద్య సిబ్బందితో పాటు పోలీస్, మునిసిపల్, పంచాయతీ రాజ్, ప్రెస్ వారిని మంత్రి అభినందించారు. జ్వర సర్వే నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ప్రజల హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమానికి కూడా స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలే అని చెప్పవచ్చని మంత్రి అన్నారు. నగరంలో సత్పలితాలు ఇచ్చిన బస్తీ దవాఖానాలు పల్లెల్లో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. బీపీ, షుగర్ ఉన్న వారికి వాటికి సంబంధించిన మందులతో కూడిన కిట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు.

జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆ దిశలో ప్రభుత్వ వైద్య సిబ్బందికి సహకరించాలని అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ… అందరికి వివిధ రకాల పరీక్షలు చేయటం మంచి పరిణామమ‌న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోనే ఈ కార్యక్రమాన్ని చేవెళ్లలో ప్రారంభించటం గొప్ప విషయమ‌న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మి, ఎంపీపీ విజయ లక్ష్మి రమణ రెడ్డి, సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి, ఎంపీటీసీ వసంతం, అడిషనల్ జిల్లా వైద్యాధికారి దామోదర్, డాక్టర్లు రాజశేఖర్, రఘుబాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement