Wednesday, May 1, 2024

TS: మెడిక‌ల్ కాలేజిలో ర్యాగింగ్‌… ఇంటి దారిప‌ట్టిన విద్యార్థులు..

ర్యాగింగ్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా కాలేజీలను ర్యాగింగ్ భూతం వదలడంలేదు. తరచుగా జూనియర్ విద్యార్థులు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఎంత అవ‌గాహ‌న క‌ల్పించిన ఫ‌లితం లేకుండా పోయింది. ర్యాగింగ్ నుంచి త‌ప్పించుకునేందుకు విద్య‌కు దూర‌మ‌వ్వాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. అలాంటి ఘ‌ట‌నే తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం వైద్య కళాశాలలో జ‌రిగింది.

ర్యాంగింగ్ పేరుతో సీనియర్లు రెచ్చిపోయారు. అర్ధరాత్రి జూనియర్ల హాస్టల్ రూమ్ లలోకి చొరబడి వేధింపులకు గురిచేశారు. ఇద్దరు విద్యార్థులకు గుండ కొట్టి, మీసాలు తొలగించారు. దీంతో భయాందోళనకు లోనైన ఆ విద్యార్థులు తెల్లారి ఇంటికి వెళ్లిపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీనియర్ల ఆగడాలతో విసిగిపోయిన జూనియర్ విద్యార్థులు కాలేజీలో ఆందోళన చేపట్టారు. వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు బైఠాయించారు.

రామగుండం మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతూ, కాలేజీ అనుబంధంగా ఉన్న హాస్టల్ లో ఉంటున్న ఇద్దరు విద్యార్థుల గదుల్లోకి సీనియర్లు మూకుమ్మడిగా చొరబడ్డారు. జూనియర్లను ప్రశ్నలతో వేధిస్తూ జుట్టు అంతలా ఎందుకు పెంచారని నిలదీశారు. అనంతరం ట్రిమ్మర్ తో గుండు చేసి, మీసాలు కూడా తొలగించారు. వారితో పాటు మరో ముగ్గురు విద్యార్థులను కూడా ర్యాగింగ్ చేశారు. ఈ విషయాన్ని ఫోన్ లో తమ తల్లిదండ్రులకు వివరించిన బాధిత స్టూడెంట్లు.. ఉదయాన్నే ఇంటికి వెళ్లిపోయారు. కాగా, ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేస్తున్న ఆగడాలతో విసిగిపోయిన జూనియర్లు ఆందోళన చేపట్టారు. ర్యాగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసి కాలేజీకి వెళ్లిన గోదావరిఖని పోలీసులు.. ర్యాగింగ్ ఘటనపై జూనియర్లను విచారించారు. దీనిపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement