Sunday, May 5, 2024

సీఎంను ఒప్పించి భూములకు పట్టాలు ఇప్పించా : మంత్రి వేముల

ధరణీలో మార్పులు చేసే అధికారం రాష్ట్రంలోని ఏ కలెక్టర్‌ కు లేదు. కాని నిజామాబాద్‌ జిల్లాలోని పరిష్కారానికి నోచుకోని దేవక్కపేట్‌ భూములకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో పరిష్కారం చూయించడం జరిగిందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం భీమ్‌ గల్‌ మండలం దేవక్కపేట్‌ గ్రామానికి చెందిన 2 వందల మందికి పట్టాపాస్‌ పుస్తకాలను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు పాస్‌ పుస్త‌కాలను అందించారు. గిరిజన గ్రామాల ప్రజలు అడవులను కొట్టవద్దని సూచించారు. గ్రామాల వారిగా అడవులను రక్షించేందుకు ఎవరికి వారుగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి త్వరలో పోడు భూములకు కూడా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దేవక్కపేట్‌ గ్రామస్తుల కోరిక మేరకు ప్రధాన రహదారి, తాటిపల్లి రోడ్డుతో పాటు చెక్ డ్యాం నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు.

జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మాట్లాడుతూ… జిల్లాలో మొత్తం 10,500 ఎకరాల భూమి వివాదస్పదంగా ఉందన్నారు. అటవీ, రెవెన్యూ శాఖల మద్య ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు యంత్రాంగం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోనే మొట్ట మొదటి సారిగా భీమ్‌గల్‌ మండలం దేవక్కపేట్‌ గ్రామంలోని భూములకు పరిష్కారం చూపిన ఘనత మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని వివాదస్పద భూముల సమస్యను ముఖ్యమంత్రి కేసీఆ ర్ దృష్టికి తీసుకెళ్ల‌డం జరిగిందని చెప్పారు. ప్రత్యేక అనుమతులతోనే నేడు పట్టాలు ఇచ్చినట్లు కలెక్టర్‌ పేర్కోన్నారు. జాయింగ్‌ సర్వే నిర్వహించి దేవక్కపేట్‌ గ్రామంలోని 2వందల మందికి నేడు పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందించినట్లు చెప్పారు. సమస్యను పరిష్కరించడంలో స్థానిక ఆర్డీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ రాజేందర్ కృషి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆర్డీవో, తహసీల్దార్‌లను అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రవి, పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, సర్పంచి అనిల్‌, జైరాం శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.


రేణుకదేవి ఆలయంలో పూజల్లో పాల్గొన్న మంత్రి, కలెక్టర్ :
భీమ్‌గల్‌ మండలం మెండోరా గ్రామంలోని గౌడసంఘం ఆధ్వర్యంలో రేణుకదేవి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌడ సంఘం ప్రతినిధులు మంత్రి వేములకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గౌడసంఘం ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement