Saturday, April 27, 2024

Big story | భారీ రాబడికి బాటలు.. భూముల వేలంపై పునరాలోచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భూముల వేలంతో మరోసారి భారీ రాబడి దిశగా సర్కార్‌ పునరాలోచన చేస్తోంది. ఈ దఫా పెద్ద ఎత్తున ఆర్‌ అండ్‌ బీ ఆధ్వర్యంలో వేలానికి కార్యాచరణ చేస్తోంది. తద్వారా ఒకేసారి రూ. 10వేల కోట్లు సులువుగా ఖజానాకు చేర్చొచ్చనే అధికారుల నివేదికలను తాజాగా పరిశీలిస్తోంది. ఇందులో దిల్‌ భూములతోపాటు పలు జిల్లాల్లో ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. ఆర్‌ అండ్‌ బీ శాఖలో విలీనం చేసిన దక్కన్‌ ఇనఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌(దిల్‌) భూములపై సర్కార్‌ సమీక్షిస్తోంది. ఈ భూములను ఏం చేయాలనే కోణంలో విచారిస్తోంది.

అదేవిధంగా దిల్‌తోపాటుచ గృహనిర్మాణ శాఖకు చెందిన భూములను వేలం వేసే దిశగా మరోసారి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి ప్రత్యేక సెల్‌ ద్వారా ఆయా భూములను పరిరక్షిస్తున్నారు. దిల్‌కు హైదరాబాద్‌, మేడ్చేల్‌, రంగారెడ్డి జిల్లాల్లో 1890 ఎకరాలున్నాయి. ఇందులో 900 ఎకరాల్లో వివాదాలు నడుస్తున్నాయని తెలిసింది. ఎటువంటి వివాదాలులేని 800 ఎకరాల భూములకు రూ. 4వేల కోట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

పేరుకే రికార్డుల్లో ‘దిల్‌’ భూములు…

తమ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములు కనిపించడంలేదని రెవెన్యూ శాఖ లబోదిబోమంటోంది. రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి నిమిత్తం 2007లో అప్పటి సీఎం వైఎస్‌ నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లోని సుమారు 5100 ఎకరాలను దక్కన్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌(దిల్‌)కు కేటాయించారు. అయితే గతంలో నిరుపయోగంగా ఉన్న సదరు భూముల కేటాయింపును రద్దు చేస్తూ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా భూములను తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది.

అందులో కొంత మేర నల్గొండ జిల్లాలోని సుమారు 300 ఎకరాలను యాదాద్రి టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి కేటాయించింది. అదేవిధంగా మిగతా భూములను కూడా ప్రభుత్వ, ప్రజోపయోగ అవసరాలకు వినియోగించె దిశగా ప్రణాళికలను రూపొందించుకుంది. ఇందులో భాగంగా నిర్ధేశిత అవసరాలు, ప్రభుత్వ యోచన సఫలం అయ్యేలా రెవెన్యూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 5వేల పైచిలుకు విలువైన భూములను గుర్తించి రాష్ట్ర లాండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ పరిధిలోని భూమి బ్యాంకుకు చేర్చాలని నిర్ణయించి ఆయా భూములను ఆర్‌ అండ్‌ బీ శాఖకు బదలీ చేశారు.

మరో 300 ఎకరాలు మాయం…

తాజాగా ఆర్‌ అండ్‌ బీలో విలీనం తర్వాత క్షేత్ర స్థాయికి వెళ్లిన అధికారులకు 300 ఎకరాలు కనిపించడంలేదని తెలిసింది. ఈ అంశం ముఖ్యమంత్రికి నివేదిక రూపంలో సీసీఎల్‌ఏ అధికారావర్గాలు అందజేశారని సమాచారం. కాగా కేటాయించిన భూమి ఆక్రమణలకు గురైందని తేలినా కఠిన చర్యలకు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. సదరు ఆక్రమిత భూముల వివరాలు, సర్వే నెంబర్లు రెవెన్యూ రికార్డుల్లో కనిపించడంలేదని భూ పరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్‌కు ఇటీవలే నివేదిక అందింది.

కనిపించకుండా పోయిన భూములివే….

దిల్‌ సంస్థకు కేటాయించిన భూముల్లో తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మొయినాబాద్‌ మండలం అజీజ్‌ నగర్‌లో 126 ఎకరాలను దిల్‌కు కేటాయించారు. కాగా ఇప్పటివరకు సర్వే చేసిన అధికారులకు అందులో 66 ఎకరాలు మాత్రమే దొరికింది. రెవెన్యూ రికార్డులు, పొజిషన్‌లో అదే కనిపించింది. కాగా మిగతా 60 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లుగా తేలింది. దీంతో చేసేదిలేక రికార్డుల ప్రకారం గుర్తించిన 66 ఎకరాలకే హద్దులను నిర్ణయించి ప్రభుత్వం స్వాధీనం చసుకున్నట్లుగా రెవెన్యూ అధికారులు బోర్డులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా విలువైన ప్రాంతంగా పేరున్న రాజేంద్రనగర్‌ మండలంలో కేటాయించిన 41 ఎకరాలకుగానూ 21 ఎకరాలే గుర్తించగలిగారు. సరూర్‌నగర్‌ మండలం నాదర్‌గుల్‌లో 197 ఎకరాలూ కనిపించడంలేదని, మొత్తంగా ఆక్రమణదారులు ఖబ్జా చేసుకున్నారనే సమాచారం రెవెన్యూ వర్గాలను కలవరానికి గురిచేసింది. కీసర మండలంలో 10 ఎకరాల్లో ఇంచు భూమి కూడా మిగలలేదని వెల్లడైంది.

ప్రభుత్వానికి చేరిన నివేదిక….

తాజాగా వెల్లడైన విషయాలతో వెంటనే అప్రమత్తమైన రెవెన్యూ శాఖ మొత్తం వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఈ అంశంలో తదుపరి చర్యలకు మార్గం చూపాలని కోరింది. ముందుగా ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొహిబిషన్‌ చట్టాన్ని ప్రయోగించాలని యోచించినా ప్రభుత్వ అనుమతితోనే ముందుకు వెళ్తామని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. న్యాయపరమైన విషయాలను కూడా పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement