Monday, April 29, 2024

Parliament Session – బోసిబోతున్న బ‌డ్జెట్ చ‌ర్చ‌లు….

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి … దేశంలోని చట్టసభల్లో బడ్జె ట్‌ సమావేశాలు తూతూ మంత్రంగా మారాయి. కేవలం అధికార, విపక్ష సభ్యుల మధ్య పరస్పర ఆరోప ణలు, దూషణలకే ఇవి పరిమితమౌతున్నాయి. రాన్రాను వీటి పట్ల సాధారణ ప్రజల్లో ఉత్సుకత తగ్గుతోంది. వీటిని చూడాలని గాని, ఆకళింపు చేసుకోవాలని గాని ఇప్పుడు జనం భావించడంలేదు. ఒకప్పుడు చట్టసభల సమావేశాలంటే జనం చెవికోసుకునేవారు. ఇవి మేథావి వర్గాల ఆలోచనా విధానాలకు, ప్రసంగాలకు ప్రతీక గా నిల్చేవి. తామెన్నుకున్న ప్రతినిధులు తమ సమస్యలపై చర్చి స్తున్న తీరును జనం ఉగ్గబట్టి వినేవారు. అప్పట్లో టెలివిజన్లు అందుబాటులో లేకపోవడంతో రేడియోల చెంత జనం గుమి గూడి చట్టసభల సమావేశాల గురించి సవివరంగా తెలుసుకునే వారు. మరీ ముఖ్యంగా బడ్జెట్‌ సమావేశాల సమయంలో కూలం కుషంగా ఆకళింపు చేసుకునేవారు. అప్పట్లో బడ్జెట్‌ అంటే దేశంలో లేదా రాష్ట్రంలోని అన్ని శాఖల అవసరాలు ఆదాయాల్ని గుణించి తయారు చేసేవారు. అలాగే ఏడాది పొడవునా అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించిన సమస్యలకు బడ్జెట్‌లో పరిష్కారాలు చూపేవారు. గత, అంతకుముందు ఏడాది కేటాయింపులకు సంబంధించి వాస్తవిక వ్యయంపై సుదీర్ఘ చర్చ జరిపేవారు. ప్రాధాన్యతాంశాలకనుగుణంగా ఈ కేటాయింపు లుండేవి. సభ్యుల లేదా ప్రభుత్వ ఇష్టాఇష్టాల్తో పనిలేకుండా దేశం లేదా రాష్ట్ర పురోగతికే బడ్జెట్‌ కేటాయింపుల్లో పెద్దపీటేసేవారు.

అనంతరం వీటిపై జరిగే చర్చలు విద్యార్ధులకెంతో ఉపకరంగా ఉండేవి. పెద్దల విజ్ఞాన సముపార్జనకు ఉపకరించేవి. అప్పట్లో అధికార, ప్రతిప క్ష సభ్యుల మధ్య బడ్జెట్‌ కేటాయింపులపై జరిగే వాదప్రతివాదనలకు నిబద్దతుండేది. ఇందుకోసం ఏకంగా మూడేసి మాసాలు ఈ సమావేశాలు జరిగేవి. బడ్జెట్‌ సమావేశాల్ని రెండుభాగాలుగా విభజించేవారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టేవరకు ఓ భాగం కాగా.. ఆ తర్వాత సెలవులిచ్చి తిరిగి సమావేశాల్ని పున:ప్రారంభించేవారు. ఈ సమావేశాల్లోనే సుదీర్ఘంగా బడ్జెట్‌ కేటాయింపులపై చర్చలు జరిగేవి. ఇలాంటి చర్చల్లో ఆరితేరిన వ్యక్తి కేంద మాజీ మంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌. ఆయన వాస్తవానికి విద్యాధికుడుకాదు. కానీ ప్రపంచాన్ని చదివారు. ప్రజల అవసరాల్ని ఆకళింపు చేసుకున్నారు. చట్టసభల్లోని సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తుంటే రేడియోలు, టివిల ముందు జనం అతుక్కుపోయేవారు. మధ్య మధ్యలో హాస్యోక్తులు విసురుతూ సమకాలిన సమాజ అవసరాల్ని ఆయన సభ ముందుకు తెచ్చేవారు. వాటి పరిష్కారానికి నిజాయితీతో కూడిన స్పష్టమైన సూచనలు, సలహాలు ఇచ్చేవారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై ఆయన నిబద్దతకు సంబంధించి ఎలాంటి మార్పుండేదికాదు. వీటిపై చర్చించేందుకు రోజుల తరబడి అధ్యయనం చేసేవారు. లోతుగా పరిస్థితిని ఆకళింపు చేసుకునేవారు. ఈ కారణంగానే ఆయనకు ఏ సంస్థ అధికారికంగా గుర్తింపునివ్వకపోయినా దేశంలోని ఉత్తమ పార్లమెంటేరియన్‌లలో ఒకరిగా లాలూప్రసాద్‌ గుర్తింపు పొందారు.

దేశంలో చట్టసభల సమావేశాల్ని ప్రభుత్వాలే ఏర్పాటు చేస్తాయి. అయితే ఇందుకోసం స్థిరమైన క్యాలండర్లను రాజ్యాంగం నిర్దేశించలేదు. ప్రతి ఏటా మూడుసార్లు చట్టసభలు సమావేశమవడం సంప్రదాయంగా వస్తోంది. ఆయా కాలాల్ని బట్టి వీటిని బడ్జెట్‌, వర్షాకాల, శీతాకాల సెషన్స్‌గా పిలవడం అలవాటైంది. ఏ రెండు సెషన్ల మధ్య ఆరుమాసాలకు మించి విరామం ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడాదికి రెండుసార్లు చట్టసభలు సమావేశం కావాలి. ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచి మే వరకు బడ్జెట్‌, జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు వర్షాకాల, నవంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు శీతాకాల సమావేశాలు నిర్వహించడం ఒకప్పుడు సంప్రదాయంగా ఉండేది. అలాగే బడ్జెట్‌ సమావేశాల్ని రెండు విడతలుగా మూడుమాసాల పొడవునా నిర్వహించేవారు. ఈ విధానంలో చర్చలు సుదీర్ఘంగా సాగేవి. పలు సమస్యల్ని సభ్యులు చట్టసభల దృష్టికి తెచ్చి బడ్జెట్‌లో అదనపు కేటాయింపులు సాధించేవారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలకనుగుణంగా తమతమ నియోజకవర్గాల్లో పనులకు కేటాయింపులు పొందగలివారు.

కాగా ఇప్పుడు సమావేశాల తీరుతెన్నులే కాదు.. కాలపరిమితి కూడా మారిపోయింది. మరీ ముఖ్యంగా కోవిడ్‌ అనంతరం సమావేశాలు జరుగుతున్న రోజుల సంఖ్యను కుదించేశారు. కోవిడ్‌ సమయంలో బడ్జెట్‌ల ఆమోదానికి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రోజుల పాటు ఈ సమావేశాల్ని నిర్వహించారు. అప్పుడున్న మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని నిబంధనల్ని సడలించారు. అయితే కోవిడ్‌ మహమ్మారి వైదొలగిన అనంతరం కూడా సమావేశాలు జరిగే కాలపరిమితిని పునరుద్దరించలేదు. కోవిడ్‌ సమయంలోలాగే ఇప్పుడు కూడా కొన్ని రోజుల పాటే సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలకే ఎక్కువ సమయం సరిపోతోంది. ప్రజాసమస్యలపై చర్చ కంటే రాజకీయ ప్రయోజనాలకే సభ్యులు ప్రాధాన్యతనిస్తున్నారు. తమ తమ పార్టీల ప్రయోజనాల పరిరక్షణకు ప్రాకులాడుతున్నారు. దీంతో ఇప్పుడీ సభలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టివిలు, ఇతర మాద్యమాలు అందుబాటులోకొచ్చేసినా వీటి పట్ల ప్రజల్లో పెద్దగా ఆసక్తి వ్యక్తం కావడంలేదు. వీటిని వీక్షించడం ద్వారా తమకదనంగా చేకూరే విజ్ఞానమేమీ లేదన్న భావం వివిధ వర్గాల్లో స్పష్టమౌతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement