Wednesday, May 1, 2024

Nomination Filled – ధ‌ర్మం కోసం చావడానికి సిద్ధం – బండి సంజ‌య్

క‌రీంన‌గ‌ర్ – తాను, రాజాసింగ్ ధర్మం కోసం పని చేస్తున్నామని, దర్మం కోసం చావడానికి సిద్ధమని అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్.. కాషాయం జెండా కోసం పని చేసే నాయకులమని పేర్కొన్నారు. కాషాయ జెండాని తెలంగాణ అంతటా రెపరెపలాడించామని తెలిపారు. 24 రోజులు పూర్తి స్థాయిలో తనకు సహకారం అందించాలని కోరారు. కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ… హిందువుల ఓట్లను బీజేపీ ఓటు బ్యాంక్ గా మార్చడంలో సఫలయ్యామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ కేసులు పెట్టి తనను జైలుకు‌ పంపారని మండిపడ్డారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థుల కోసం కొట్లాడితే తనపై ముప్పై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీని‌ డెవలప్ మెంట్ చేస్తామని‌ సవాల్ చేశానని తెలిపారు. కరీంనగర్ లో‌ కాషాయం జెండాకే స్థానం ఉందన్నారు.


స్మార్ట్ సిటీ నిధులు, నేషనల్ హైవే నిధులు తానే తీసుకొచ్చానని తెలిపారు. గ్రామ పంచాయతీకి నిధులు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. బీజేపీ సహకారం లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మీటింగ్ కు ప్రజలు ఎవరు రావడం లేదని విమర్శించారు. కాళేశ్వరం రిపోర్టు కరెక్ట్ కాదా? కాళేశ్వరం పిల్లర్లకి పగుళ్లు వచ్చింది నిజం కాదా అని నిలదీశారు.


కరీంనగర్ ఎన్నికల ఫలితాల కొసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తుందన్నారు. ప్రజల కోసం కొట్లాడిన వారిని‌ అసెంబ్లీకి పంపాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్న ఒక్కరికైనా రేషన్ కార్డు ఇప్పించారా అని నిలదీశారు. గంగుల కమలాకర్ బాధితుల సంఘం ఏర్పాటు చేసే పరిస్థితి కరీంనగర్ లో ఉందని ఎద్దేవా చేశారు. ధర్మం కోసం పోరాడేది కేవలం బీజేపీ మాత్రమే అన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, తాను ధర్మం కోసమే పోరాడుతున్నామన్నారు. తామిద్దరం ఎప్పుడూ కాషాయజెండాను వదిలి పెట్టలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు పది ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు.
అంత‌కు ముందు నామినేష‌న్ పత్రాల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు.. ఆ త‌ర్వాత త‌ల్లీ అశీర్వాదం తీసుకుని ఇంటి నుంచి రిట‌ర్నింగ్ అధికారి ఇంటి వ‌ర‌కు బైక్ ర్యాలీ నిర్వ‌హంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement