Friday, May 10, 2024

పని చేయని వారికి నో టికెట్‌, నో పదవి.. వంద శాతం సభ్యత్వం చేయాల్సిందే: కాంగ్రెస్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ‘‘పార్టీలో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫైరవీ లేకుండానే టికెట్‌ ఇచ్చే హామీ నాది. కానీ సభ్యత్వంలో బలంగా పని చేయని వారికి నో టికెట్‌.. నో పదవి. కష్టపడి పని చేసేవారిని గుర్తించేందుకు సభ్యత్వ నమోదును ప్రామాణికంగా తీసుకుంటున్నాం”అని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీభవన్‌ ఆవరణలో ఇందిరాభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జీ కార్యదర్శితో పాటు పలువురు ముఖ్య నాయకులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సభ్యత్వ నమోదుతో పాటు పార్టీ కార్యక్రమాల విషయంలో పని చేయని వారికి టికెట్‌, పార్టీ పదవి రాకుండా తాను అడ్డుకుంటానని, ఈ విషయంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, యువతనేత రాహుల్‌గాంధీతో మాట్లాడుతానని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ నుంచి వంద సభ్యత్వం ఉంటేనే పీసీసీ మెంబర్‌ ఉంటుందని, వంద సభ్యత్వం లేకుండా ఉంటే ఎంత పెద్ద నాయకుడైనా పీసీసీ సభ్యత్వం ఇచ్చేది లేదని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

అందుకు పార్టీ టికెట్‌ ఆశించిన వారు జాగ్రత్తగా పని చేయాలన్నారు. టికెట్ల ఎంపికలో ఢిల్లీ నుంచే అభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. సభ్యత్వ నమోదు బాగా చేసిన వారి పనితీరును సోనియాగాంధీకి సమగ్ర నివేదిక అందిస్తానని, సభ్యత్వం ఉన్న వారికే కాంగ్రెస్‌ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీ సమావేశానికి రాకుండా లైట్‌గా తీసుకున్న వారికి పదవుల ఎంపికలో అవకాశాలు కల్పించేది లేదని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

40 లక్షల సభ్యత్వం నమోదు..
కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు ఇప్పటి వరకు 40 లక్షలకు చేరిందని, మరో 10 లక్షల సభ్యత్వం పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఒక్కో సభ్యుడు ఒక ఓటును అదనంగా తీసుకొచ్చి 80 లక్షల ఓట్లు వచ్చేలా చూడాలన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు అదనంగా ఒక ఓటును తీసుకొస్తే పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ వైపు ఉన్నారనడానికి పార్టీ సభ్యత్వ నమోదు ఒక ఉదహరణ అని అన్నారు. ఈ అవకాశాన్ని పార్టీ నాయకులు అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సభ్యత్వ నమోదులో నల్లగొండ పార్లమెంట్‌ నియోజక వర్గం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, మంచిర్యాల అసెంబ్లిd నియోజక వర్గంలో రికార్డ్‌ స్థాయిలో నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇన్స్‌రెన్స్‌ పర్యవేక్షణకు కాల్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

మన సభ్యత్వాన్ని చూసే పీకేను తెచ్చుకున్న కేసీఆర్‌..
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం 40 లక్షలకు చేరడంతో సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకున్నదని, అందుకనే ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్‌కిషోర్‌ను తెచ్చుకున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు ఒక్క పీకే ఉంటే.. కాంగ్రెస్‌కు 40 లక్షల మంది ఏకే 47లు ఉన్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి ఇదే తార్కణమన్నారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు వచ్చాయని ఆయన ఆరోపించారు. ఈ సమీక్షలో పార్టీ సీనియర్లు షబ్బీర్‌అలీ, టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, సభ్యత్వ నమోదు కో ఆర్డినేటర్‌ హర్కర వేణుగోపాల్‌తో పాటు డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement