Thursday, May 2, 2024

జీఎస్‌డీపీకి అనుగుణంగా పెట్టుబడి వ్యయం పెరగలేదు: కాగ్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కంఎ్టోల్రర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం అసెంబ్లి ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్‌, ఫైనాన్స్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదించింది. నీటి పారుదల, వైద్యం, ఆరోగ్యం, పంచాయతీరాజ్‌ శాఖలకు 34 శాతం అధికంగా ఖర్చు చేసిందని తెలిపింది. గృహ నిర్మాణం, పరిశ్రమల శాఖల కేటాయింపు కంటే తక్కువగా ఖర్చు చేసిందని పేర్కొంది. రాష్ట్రంలో పెరుగుతున్న జీఎస్డీపీ శాతానికి అనుగుణంగా పెట్టుబడి వ్యయం పెరగడం లేదని కాగ్‌ అభిప్రాయపడింది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కాగ్‌ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టింది.

అప్రోప్రియేషన్‌ అకౌంట్స్‌, ఫైనాన్స్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదికలను అధికారులు శాసనసభ, శాసన మండలిలో ఉంచారు. 2021-22లో రాష్ట్ర ప్రభుత్వం 11 గ్రాంట్లకు సంబంధించి రూ.75వేల కోట్లు అధికంగా వ్యయం చేసిందని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. ఆర్థిక, నీటిపారుదల, వైద్య ఆరోగ్యం పంచాయతీరాజ్‌ శాఖల కేటాయింపులకు మించి 34 శాతం ఖర్చు అయ్యాయని పేర్కొంది. గృహ నిర్మాణం, పరిశ్రమల శాఖల కేటాయింపు కంటే తక్కువగా ఖర్చు చేశారని వివరించింది.

- Advertisement -

2021-22లో ఓవర్‌ డ్రాప్ట్‌

2021-22లో రాష్ట్ర ప్రభుత్వం 289 రోజుల పాటు స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ, 259 రోజుల పాటు వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌ సౌకర్యాన్ని వినియోగించుకుందని తెలిపింది. 2021-22లో రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల పాటు 22,669 కోట్ల రూపాయల ఓవర్‌ డ్రాప్ట్‌కు వెళ్ళిందని పేర్కొంది. 2018-19లో ఉన్న రెవెన్యూ మిగులుతో ఉన్న రాష్ట్రం 2020-21 నాటికి 9,335 కోట్ల రెవెన్యూ లోటుకు వెళ్లిందన్న కాగ్‌, రెవెన్యూ రాబడుల్లో 50 శాతం వరకు ఉద్యోగుల వేతనాలు, వడ్డీ చెల్లింపులకే పోతున్నాయని వివరించింది.

జీఎస్డీపీలో అప్పు 27.40 శాతం

2021-22 వరకు రాష్ట్ర ప్రభుత్వ రుణాలు రూ.3,14,662 కోట్లుగా ఉన్నాయని, ఆ మొత్తం జీఎస్డీపీలో అప్పు 27.40 శాతంగా ఉందని కంఎ్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వివరించింది. 2021-22 లో పన్ను ఆదాయం 37శాతం, పన్నేతర ఆదాయం 45శాతం పెరిగిందని, ఇదే సమయంలో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు మాత్రం 44 శాతం తగ్గినట్లు చెప్పింది. 2021-22 లో తీసుకున్న 46,994 కోట్ల రూపాయల రుణాల్లో రూ.28,883 కోట్లను పెట్టుబడి వ్యయం కోసం వినియోగించారని, రుణాల ద్వారా సమీకరించుకున్న మొత్తాన్ని కూడా అప్పులు, వడ్డీ చెల్లింపుల కోసం వినియోగించుకున్నారని కాగ్‌ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement