Saturday, May 4, 2024

విమాన ప్రయాణంలో బెంగళూరు ఫస్ట్‌! భారీగా పెరిగిన‌ ఎయిర్‌ ట్రాఫిక్‌

విమానయాన ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండే విమానాశ్రయాల్లో బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరుగుదల విషయంలో దేశంలోని అన్నినగరాలను బెంగళూరు అధిగమించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే కాదు, 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కూడా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో విమాన ట్రాఫిక్‌ భారీగా పెరిగింది. ఈ త్రైమాసికంలో బెంగళూరు విమానాశ్రయం నుంచి 84 లక్షల మంది దేశీయ విమాన ప్రయాణికులు ప్రయాణించారు.
అంతేగాకుండా అత్యధికంగా విమానాలు ఉన్న విమానాశ్రయాల్లో బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ మూడో స్థానంలో ఉంది.

ముఖ్యంగా బెంగళూరు విమానాశ్రయం ఇటీవలి కాలంలో విమానాల రద్దీని ఎక్కువగా చూస్తోంది. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అందించిన సమాచారం ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇతర నగరాల కంటే బెంగళూరు దేశీయ విమాన ప్రయాణాలలో అత్యధిక వృద్ధిని సాధించింది. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ నుంచి దేశీయ ఫ్లైట్‌ సర్వీసుల సంఖ్య సైతం పెరిగింది. బెంగళూరు విమానాశ్రయం నుంచి 2.81 కోట్ల మంది దేశీయ ప్రయాణికులను హ్యాండిల్‌ చేసింది.

2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, బెంగళూరులో దేశీయ విమాన ట్రాఫిక్‌ శాతం 85శాతం పెరిగిందని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నివేదికలు చెబుతున్నాయి. భారత విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మరిన్ని విమానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల ప్రయాణికుల రద్దీ పెరిగిపోవడంతో విమానాల సంఖ్య కూడా అధికంగా పెరిగిపోయింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ఎయిర్‌లైన్స్‌ కూడా కొత్త కొత్త విమానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement