Tuesday, April 30, 2024

మిషన్ భగీరథ పైపులకు రెక్కలు.. ఎత్తుకెళ్లిపోతున్న ఆగంతకులు

భీంగల్ టౌన్, జూలై 28 (ప్రభ న్యూస్) : మిషన్ భగీరథ పైపులు ఎత్తుకు పోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం కోసం రాష్ట్రంలోని అన్నిచోట్ల లారీల కొద్ది పైపులు తెచ్చి ఖాళీ స్థలాల్లో డంప్ చేశారు. మిషన్ భగీరథ పనుల కోసం అవసరమున్న పైపులను తీసుకెళ్లి బిగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పనులు పూర్తయి చాలా రోజులవుతుంది. కానీ డంప్ చేసిన చోట ఉంచిన మిగిలిన పైపులు తీసుకెళ్లలేదు. దాంతో అక్రమార్కుల కన్ను పైపులపై పడింది. తమ ఇంటి, పంట పొలాలు, డ్రైనేజీ తదితర అవసరాల కోసం పైపులను యధేచ్చగా తరలిస్తున్నారు.

ఒక్కో పైప్ ధర చాలా ఎక్కువగా ఉంటుందని, నాణ్యతలో కూడా స్టాండర్డ్ గా ఉండడంతో పైపులు దొంగతనంగా ఎత్తుకెళ్లుతున్నారు. పైపులు యధేచ్చగా దొంగిలిస్తున్నా.. ఎవరు పట్టించుకోకపోవడంతో కొందరు లీడర్లు సైతం పైపులు తరలించేందుకు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏకంగా భీంగల్ కు చెందిన నాయకుడు ఒకరు పైపులు తరలించేందుకు తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడని ప్రజల్లో చర్చ జరుగుతుంది. భీంగల్ పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో డంప్ చేసిన పైపులను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా రాజుల సొమ్ము రాళ్ల పాలు అనుకుంటారా చూడాల్సి ఉంది. ఈ విషయంపై ఎంపీడీఓ రాజేశ్వర్, మిషన్ భగీరథ అధికారులను వివరణ కోరగా.. పైపుల విషయం తమకు తెలియదని, ఎవరికి చెందినవో తెలుసుకుని చెబుతామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement