Monday, May 6, 2024

Delhi | హస్తం గూటికి ఆకుల లలిత, ఏనుగు ర‌వీంద్ర‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అసెంబ్లీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తులో భాగంగా శుక్రవారం ఉదయం గం. 9.30కే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉన్నందున, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి. సంతోష్ కుమార్ గురువారం రాత్రే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

శుక్రవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసి మరోసారి ఆయనతో కండువా కప్పించుకున్నారు. ఈ ముగ్గురితో పాటు మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, శామ్యూల్, శ్రీదేవి, ఎంపీపీ, జెడ్పీ ఛైర్‌పర్సన్లుగా పనిచేసిన పలువురు నేతలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ముఖ్యనేతలకు ఖర్గే కండువా కప్పగా.. మిగతా నేతలకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందరికీ పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను కూడా అందజేసింది.

కేసీఆర్‌ను దించే సత్తా కాంగ్రెస్‌కే ఉంది: రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (కేసీఆర్)ను గద్దె దించే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, అందుకే తాను కండువా మార్చానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను బీజేపీలో ఉన్నా.. కాంగ్రెస్‌లో ఉన్నా తన లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దించడమేనని చెప్పారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందని తాను భావించానని, కానీ పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదని అన్నారు.

బండి సంజయ్‌ను మార్చిన తర్వాత బీజేపీ బలహీనపడిందని అన్నారు. అందుకే మళ్ళీ కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చానన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని, ప్రజల కోరిక మేరకే తాను కాంగ్రెస్‌కి తిరిగి వచ్చానని తెలిపారు. ఒకవేళ బీపీకి ఓటేసినా, హంగ్ ఫలితాలు వస్తే ఆ పార్టీ మద్దతిచ్చేది బీఆర్ఎస్ పార్టీకేనని, అంటే బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్‌కి ఓటేసినట్టే అవుతుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

తనకు పదవులు ముఖ్యం కాదని, తానేమీ కేసీఆర్‌లా నియంతను కాదని, ప్రజల కోసం వంద అడుగులైనా వెనక్కి వేస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వల్లనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాయని, ఈ ఎన్నికల్లో 70-80 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో తనకు గౌరవం ఇచ్చారని, బీజేపీ పెద్దలంటే తనకు గౌరవం ఉందని చివర్లో అన్నారు.

ఏదీ ఆశించి చేరలేదు: కపిలవాయి దిలీప్

తాను ఏ పదవీ ఆశించకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరానని మాజీ ఎమ్మెల్సీ కపిల్వాయి దిలీప్ అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌ను ఓడించే స్థితిలో బీజేపీ లేదని, కేసీఆర్‌ను ఓడించడం కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని అన్నారు.

తాను 2009లో ఉద్యమ సమయంలోనే కేసీఆర్‌తో విబేధించి బయటికొచ్చానని, అప్పట్లో తాను కేసీఆర్ గురించి చెప్పిన మాటలు ఎవరూ నమ్మలేదని, కానీ ఇప్పుడు అందరూ తన కంటే ఎక్కువగా తిడుతున్నారని చెప్పారు. బండి సంజయ్ మార్పు తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని అన్నారు.

అవకాశం ఇస్తే పోటీ చేస్తా: ఆకుల లలిత

బీఆర్ఎస్‌లో తనకు ఉన్నత పదవులే ఇచ్చారని, అయితే ప్రజాభీష్టం మేరకు తాను కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చానని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. సొంతగూటికి తిరిగిరావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ గట్టి అభ్యర్థికి టికెట్ ఇస్తే గెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.

తాను కూడా బీసీ మహిళగా నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నానని, అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ చేస్తానని చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. తాను కాంగ్రెస్‌లో చేరానని, తదుపరి కార్యాచరణ త్వరలో చెబుతానని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement