Thursday, May 9, 2024

NZB: తెలంగాణలో బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి..మహేష్

నిజామాబాద్ సిటీ, జులై 24 (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మహేష్ పిలుపునిచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలనకు వెళితే అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని నూతన కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మహేష్ హాజరై మాట్లాడారు. నిజామాబాద్ నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళుతుంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా కొంత స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి టౌన్ కు తరలించారు. ఈ సందర్బంగా టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మహేష్ మాట్లాడుతూ.. నిరుపేద ప్రజలకు కనీస అవసరమైన డబల్ బెడ్ రూమ్ ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నిజాంబాద్ జిల్లాలో ఇప్పటివరకు డబుల్ బెడ్ రూములు ప్రజలకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు.

కాంగ్రెస్ హయాంలో నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ గృహకల్ప ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, తహేర్ బిన్ అందాన్ కేశవేణు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement