Saturday, April 27, 2024

సర్కారుకు ఎన్‌జీటీ ఝులక్‌.. రూ.3800 కోట్ల జరిమానా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణలో ఇదివరకే జారీ చేసిన మార్గదర్శకాలు, తీర్పులు అమలు చేయడంలో విఫలమైందంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. తెలంగాణకు 3800 కోట్ల రూపాయల జరిమానా విధించడంతోపాటు ఈ మొత్తాన్ని రెండు నెలల్లో ప్రత్యేక ఖాతాలో జమచేయాలని ఎన్‌జీటీ ఆదేశించింది. వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టి అందుకు సంబంధించిన పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించింది. రాష్ట్రంలోని పురపాలికల్లో పారిశుధ్య, వ్యర్థాల నిర్వహణ ఆశించిన స్తాయిలో చేయడం లేదని, పర్యావరణ సురక్షా స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసును 2014 సంవత్సరంలో సుప్రీం కోర్టు ఎన్‌జీటీకి బదిలీ చేసింది. 351 నది పరివాహక ప్రాంతాలు, 124 నగరాల్లో గాలి కాలుష్యం, మరో 100 ప్రాంతాల్లో కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాలు, అక్రమంగా ఇసుకను తవ్వి పెద్ద ఎత్తున సొమ్మును ఆర్జిస్తున్నారని ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ఎన్‌జీటీ విచారణ చేపట్టి ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి వివరణ కోరింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్‌జీటీకి ఇచ్చిన వివరణ ఏ మాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ కేసును లోతుగా విచారించిన ఎన్‌జీటీ అంతిమంగా ప్రభుత్వానికి రూ.3800 కోట్ల జరిమానా విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement