Monday, April 29, 2024

Big Srory: దక్షిణాదిపై తొలుత ఫోకస్‌… బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలే లక్ష్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విజయదశమి పర్వదినాన ఆవిర్భవించబోతున్న భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)లోకి భారీ చేరికలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దసరా రోజైన బుధవారం టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ బాడీ తీర్మానం అయిన వెంటనే దానిని ఎలక్షన్‌ కమిషన్‌ ఆమోదం కోసం పంపించనున్నారు. ఈసీ ఆమోదించిన వెంటనే బీఆర్‌ఎస్‌కు తొలుత మహారాష్ట్రతో పాటు ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు ఇంఛార్జిలను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం పూర్తయిన వెంటనే పార్టీలోకి ఆయా రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తిగా ఉన్న వారిని తొలుత పార్టీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్రతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి బీఆర్‌ఎస్‌లోకి రావడానికి ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల్లో ఉండి పలు కారణాల వల్ల అసంతృప్తిగా ఉన్న బడా నేతలే రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని చేర్చుకుంటే పార్టీకి ఆయా రాష్ట్రాల్లో అతి త్వరగా రీచ్‌ వస్తుందని టీఆర్‌ఎస్‌ అధిష్టానం విశ్వసిస్తోంది. పార్టీలోకి ముఖ్య నేతలు వచ్చి చేరితేనే ఆయా రాష్ట్రాల్లో ముందు పార్టీ ఉనికి ప్రారంభమవుతుందని పార్టీ పెద్దల అభిప్రాయంగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో పార్టీ విస్తరణ వ్యూహాలు మొదలు పెట్టవచ్చని, అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునేలా కార్యాచరణ రూపొందించుకోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

తెలంగాణ సంక్షేమమే అట్రాక్షన్‌…

తెలంగాణకు పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రజల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ఎంతో కొంత అవగాహన ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు అభిమాన సంఘాలతో పాటు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌ అభిమానుల సంఖ్య మరింత ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. వీరంతా ఎప్పటి నుంచో సామాజిక మాధ్యమాలు, పలు మార్గాల ద్వారా ఏపీలో టీఆర్‌ఎస్‌ శాఖను ప్రారంభించాలని కోరుతున్నారు. ఇక మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో తెలంగాణకు సరిహద్దులో ఉన్న గడ్చిరోలి జిల్లా, రాయచూర్‌ జిల్లా వాసులు ఏకంగా తమను తెలంగాణలో కలపాలని, ఇక్కడి సంక్షేమ పథకాలు తమకూ కావాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. తమిళనాడు నుంచి కూడా గతంలో రైతు సంఘాల నేతృత్వంలో భారీ సంఖ్యలో రైతులు తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ విధానాలు నచ్చి వాటిని అధ్యయనం చేసి వెళ్లారు. దక్షిణాదిలో మిగిలిన కేరళపై మాత్రం బీఆర్‌ఎస్‌ గట్టిగా దృష్టి పెట్టాల్సి రావచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తొలుత ఇరుగు పొరుగున ఉన్న రాష్ట్రాలలో ఉన్న సానుకూలతను వాడుకుని బీఆర్‌ఎస్‌ను విస్తరించుకోవాలని పార్టీ పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement